కడప అగ్రికల్చర్: కూటమి ప్రభుత్వ పాలనలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైఎస్సార్‌సీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. కడపలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ రొండ మాధవరెడ్డి, చెన్నూరు ఎంపీపీ సురేష్‌బాబు, వల్లూరు జెడ్పీటీసీ సుబ్బయ్య తదితరులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో త్రిబుల్ ఇంజన్, దేశంలో డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్న పాలకులు రైతులను సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. గత మూడు నెలల్లో ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయని, అవి కూడా సకాలంలో అందక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రావాల్సిన పంట బీమా, పెట్టుబడి రాయితీ బకాయిలను ఇవ్వకుండా ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 874 అడుగుల నీరున్నా రాయలసీమ ప్రాజెక్టులను నింపకుండా కూటమి సర్కార్ చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. కేసీ కెనాల్‌కు నికర జలాలు ఉన్నా నీళ్లివ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని, కానీ తెలంగాణ ప్రాజెక్టులకు మాత్రం నీటిని వదులుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, నీటి విడుదలపై ప్రభుత్వానికి మొదటి నుండి చిన్నచూపేనని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి సర్కార్ స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు.
● హద్దు దాటితే ఒప్పుకోం
● అధికార పార్టీ నేతల మధ్య పోరు
టాస్క్‌ఫోర్స్ : ఇసుక వ్యాపారం అధికార పార్టీ నాయకుల మధ్య చిచ్చుపెట్టింది. ఒక ప్రాంతంలోని అధికార ప్రతినిధులు మరో ప్రాంతంలో విక్రయిస్తే ఒప్పుకోమంటూ అడ్డుపడుతున్నట్లు తెలిసింది. అధికార బలంతో జిల్లా హద్దులు దాటి వస్తే సిస్తు రూపంలో దండన తప్పదని హెచ్చరిస్తున్నారు. శుక్రవారం హద్దులు దాటి వచ్చిన ఇసుక లారీలకు గాలివీడు పోలీసుల రూపంలో అడ్డుకట్ట వేసి అధిక లోడుతో వెళ్తున్నాయంటూ అపరాధ రుసుం కోసం ట్రాన్స్‌పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్‌ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు.. ఆ మండల పరిధిలోని పాపాఘ్ని నది నుంచి ఇసుకను అన్నమయ్య జిల్లా పరిధిలో విక్రయించడానికి ప్రయత్నాలు చేశారు. కొద్ది రోజుల కిందట ఇదే విషయంపై స్థానిక నేతలు మీ జిల్లా హద్దులను దాటి మా జిల్లాలోకి ఇసుకను తరలించి విక్రయించరాదు అంటూ కడప జిల్లా నేతకు హెచ్చరికలు చేసినట్లు సమాచారం. స్థానిక నేతల మాటలను పట్టించుకోని ఆ జిల్లా నేత.. మాదీ అధికార పార్టీనే అంటూ శుక్రవారం టిప్పర్ల సాయంతో ఇసుకను గాలివీడు, మదనపల్లి ప్రాంతాలలో విక్రయానికి సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన స్థానిక అధికార పార్టీ నేతలు పోలీసులను పురమాయించి వాహనాలను సీజ్ చేసి ట్రాన్స్‌పోర్టు అధికారులకు అప్పగించినట్లు తెలిసింది. ఈ విషయంపై అధికార పార్టీ నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే అధికార పార్టీ నేతలు స్థానికంగా లభిస్తున్న ఇసుక, మట్టి, ఎర్రచందనం, ఖరీదైన సంపదను విచ్చలవిడిగా దోచుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే.
జూదరుల అరెస్ట్
వేంపల్లె : వేంపల్లెలోని అలవలపాడు క్రాస్‌లోని నిమ్మతోటలో పేకాట స్థావరంపై సీఐ నరసింహులు, ఎస్‌ఐ తిరుపాల్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది శుక్రవారం దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 10 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.1.51 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.


