మాటలతో గారడీ.. కోట్ల పేరిట బురిడీ | - | Sakshi
Sakshi News home page

మాటలతో గారడీ.. కోట్ల పేరిట బురిడీ

Aug 29 2026 1:40 AM | Updated on Aug 29 2026 1:40 AM

కడప అర్బన్‌: అంతర్జాతీయ స్థాయిలో పరిచయాలు, ఎగుమతులు–దిగుమతుల వ్యాపారంలో తిరుగులేదనే ఆర్భాట ప్రచారంతో కోట్లాది రూపాయల కుచ్చుటోపీ పెట్టిన కేటుగాడు పోలీసులకు చిక్కాడు. మోసానికి పాల్పడిన జేష్టాది సుమన్‌ దీపక్‌రాజ్‌ను వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేయడం కడప నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సుమన్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు.

అంతర్జాతీయ వ్యాపారాలంటూ నమ్మబలికి..

నిందితుడు జేష్టాది సుమన్‌ గ్లోబల్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎవర్‌ఫస్ట్‌ ఇంపీరియల్‌ గ్లోబల్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వంటి సంస్థల పేర్లతో నకిలీ హడావుడి చేశాడు. వీటికి అంతర్జాతీయ ట్రేడింగ్‌ లైసెన్సులు ఉన్నాయని, విదేశాలకు ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నామని, జాతీయస్థాయిలో ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించి పలువురి వద్ద లక్షల నుంచి కోట్ల రూపాయిల వరకు పెట్టుబడులు వసూలు చేశాడు.

డాక్టర్లు, వ్యాపారులే టార్గెట్‌..ఆర్‌బీఐ నాటకాలు

కడప నగరంలోని వైద్యులు, వ్యాపారులను టార్గెట్‌ చేసి దాదాపు రూ.10 నుండి 15 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. తొలుత తక్కువ మొత్తంతో నమ్మకం కలిగించి, ఆపై భారీ పెట్టుబడులు పెట్టించేవాడు. బాధితులకు అనుమానం రాకుండా హైదరాబాద్‌, న్యూఢిల్లీలకు తీసుకెళ్లి.. విదేశాల నుంచి తనకు వచ్చిన డబ్బులు ఆర్‌బీఐలో ఇరుక్కుపోయాయంటూ నకిలీ బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను చూపించేవాడు. ఆ డబ్బులు విడుదల కావాలంటే లక్షల్లో పన్నులు చెల్లించాలని నమ్మబలికించి బాధితుల చేతే తన ఖాతాలో సొమ్ము వేయించుకునేవాడు.

బాధితుల దురాశే పెట్టుబడిగా..

‘ఎక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం’ అనే ఆశను ఆసరాగా చేసుకుని, పెట్టుబడులు పెరిగాక కాలయాపన చేసేవాడు. బాధితులు డబ్బులు అడిగినప్పుడు విదేశీ లావాదేవీల సాకు చూపేవాడు. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అంతర్జాతీయ వ్యాపారాలంటూ ఎవరైనా పెట్టుబడులు కోరితే పూర్తిస్థాయిలో ధ్రువీకరించుకున్నాకే డబ్బులు ఇవ్వాలని పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు.

8 కేసుల్లో నిందితుడు.. కడప జైలుకు తరలింపు

ఈ కేటుగాడిపై ఇప్పటికే వివిధ పోలీస్‌ స్టేషన్లలో 8 కేసులు నమోదయ్యాయి. ఈ ఘరానా మోసం కడపలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయి? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. నిందితుడు సుమన్‌ దీపక్‌ రాజ్‌ను కడప ఒన్‌టౌన్‌ సీఐ తిమ్మారెడ్డి, ఎస్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డిలు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా, ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నాడు.

ఎగుమతులు, దిగుమతుల పేరిట

కడప నగరంలో ఘరానా మోసం

డాక్టర్లు, వ్యాపారులే టార్గెట్‌

రూ.10 కోట్ల నుంచి 15 కోట్ల

వరకు వసూలు

ఆర్‌బీఐ నకిలీ పత్రాలతో నమ్మించిన కేటుగాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement