బద్వేలు అర్బన్ : బద్వేలు సమీపంలోని కొత్తచెరువు గ్రామ శివార్లలో గల లంకమల అభయారణ్యంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ముఠా గుట్టును ఫారెస్టు అధికారులు, రూరల్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలు, తవ్వకాలకు ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం స్థానిక సిద్దవటం రోడ్డులోని ఫారెస్టు రేంజర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎఫ్‌ఆర్‌ఓ నయీమ్‌అలీ, రూరల్ సీఐ ఎన్.క్రిష్ణయ్య వివరాలు వెల్లడించారు. బద్వేలు ఫారెస్టు రేంజ్ పరిధిలోని కొత్తచెరువు గ్రామ సమీపంలో గల లంకమల అభయారణ్యంలోని నీలిబండసెల ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు.. అటవీశాఖ సిబ్బంది వెళ్లి దాడులు నిర్వహించారు. అభయారణ్యంలో తవ్వకాలు చేపడుతున్న కొందరు వ్యక్తులు అటవీశాఖ సిబ్బందిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే అటవీ ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ఉపయోగించిన ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలతోపాటు తవ్వకాల కోసం తీసుకొచ్చిన గడ్డపారలు, పారలు, గోలాలు, సమ్మెటలు, రాగిచెంబును స్వాధీనం చేసుకుని నిందితులను ఫారెస్టు కార్యాలయానికి తరలించారు. అదుపులోకి తీసుకున్న వారు సిద్దవటం మండలం ఎస్.రాజంపేటకు చెందిన ఎం.మనోజ్‌కుమార్, తిరుపతికి చెందిన ఎన్.వెంకటాద్రి, రాయచోటికి చెందిన పి.శివకుమార్‌లుగా గుర్తించినట్లు వారు తెలిపారు. ఈ తవ్వకాలలో మరో ఆరుగురు పరారైనట్లు విచారణలో తేలిందని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ రేంజర్ సి.హెచ్.పెద్దయ్య, ఎఫ్‌బీఓలు సుంకయ్య, రాజేష్‌రెడ్డి, బాలచెన్నయ్య, ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు.
ముగ్గురి అరెస్ట్
ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం


