కేవీపల్లె : స్థానిక సంస్థల ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో పాత నేరస్తుల కలికలపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్నారు. శుక్రవారం కేవీపల్లె పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. రికార్డులు పరిశీలించి, పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకుని ఫ్రెండ్లీ పోలీస్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాలు నిర్మూలించడానికి, ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడానికి రాత్రి గస్తీ ముమ్మరం చేయాలన్నారు. గ్రామ స్థాయిలో ప్రజలకు పోలీస్ శాఖ అందించే సేవలు వివరించడానికి, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు పల్లె నిద్ర కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలకడ సీఐ బి.లక్ష్మన్న, ఎస్‌ఐ వెంకటశివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


