● ఆర్టీసీ ప్రయాణం.. అడుగడుగునా నరకం
● బస్సు ఎక్కితే ‘సీటు’ లేదు..
రోడ్డెక్కితే ‘గమ్యం’ రాదు
● రవాణా ‘మంత్రి’ జిల్లాలోనే..
సామాన్యుడికి తిప్పలు
● ప్రభుత్వ రవాణా వ్యవస్థపై ప్రజల ఆగ్రహం
సాక్షి, అన్నమయ్య: జిల్లాలో ఆర్టీసీ ప్రయాణం సామాన్యుడికి అష్టకష్టాలు తెచ్చిపెడుతోంది. సమాజంలో రోజురోజుకు జనాభా మరియు కుటుంబాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, దానికి అనుగుణంగా ప్రజా సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడం లేదు. ప్రతినిత్యం పేద, మధ్యతరగతి ప్రజలు ప్రజా రవాణాగా భావించి వినియోగించే ఆర్టీసీ బస్సుల్లో రద్దీ నిత్యకృత్యంగా మారింది. ఏరోజు చూసినా బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుండటంతో కనీసం కూర్చోవడానికి సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. జిల్లాకు రావాల్సిన కొత్త బస్సులు రాకపోగా, ఉన్న పాత బస్సుల్లోనే ప్రయాణించే వారి సంఖ్య రెట్టింపు కావడంతో జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.
సీట్లు లేక సతమతం
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కేవలం 510కి పైగా బస్సులు మాత్రమే నడుస్తుండటంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, నాన్‌స్టాప్ బస్సుల సంఖ్యను భారీగా పెంచాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. సంస్థలో ఉన్న సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులన్నీ విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చైన్నె వంటి పెద్ద నగరాల సర్వీసులకే పరిమితం చేశారు. దీనివల్ల జిల్లా లోపల, పొరుగు జిల్లాల సరిహద్దు పట్టణాలకు నడిచే స్థానిక బస్సులన్నీ నిత్యం కిక్కిరిసిపోతున్నాయి. కేవలం మధ్యాహ్న సమయం మినహా, మిగతా వేళల్లో నిలబడి ప్రయాణం చేయడం నిత్యకృత్యంగా మారింది.
కండీషన్ లేని పాత బస్సులు..
ఎక్కడపడితే అక్కడ బ్రేక్‌డౌన్లు
ఆర్టీసీ పాత బస్సులు చాలా వరకు ఎక్కడపడితే అక్కడ మొరాయిస్తూ ప్రయాణికులను నడిరోడ్డుపై నిలబెడుతున్నాయి. ప్రధానంగా ప్రమాదకరమైన కడప–రాయచోటి ఘాట్ రోడ్డు మార్గంలోనూ ఇటీవల ఒకటి, రెండు బస్సులు ఆగిపోయాయి. అలాగే తంబళ్లపల్లె నియోజకవర్గ మార్గంలోనూ, పీలేరు నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పల్లె వెలుగు బస్సులు ఇటీవల తరచూ సాంకేతిక లోపాలతో మొరాయిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యలోనే బస్సు ఆగిపోవడంతో, ప్రయాణికులంతా రోడ్డుపై దిగి.. ఆ తర్వాత వచ్చే ఇతర బస్సుల్లోకి సర్దుబాటు కావలసి వస్తోంది. ఇప్పటికే కిక్కిరిసి వచ్చే బస్సుల్లోకి ఈ అదనపు ప్రయాణికులు కూడా తోడవుతుండటంతో అటు స్థలం లేక, ఇటు సమయం వృథా అయి ప్రయాణికులు నరకం చూస్తున్నారు.
సొంత వాహనాల్లోనే దూర ప్రాంతాలకు పయనం
బస్సులన్నీ ఎప్పుడు చూసినా రద్దీగా ఉండటం, సమయపాలన లేకపోవడంతో ఉద్యోగులు, ప్రయాణికులు విధిలేని పరిస్థితుల్లో అదనపు ఆర్థిక భారాన్ని మోస్తూ సొంత వాహనాలను సమకూర్చుకుని వెళుతున్నారు. విభిన్న రంగాల్లో పనిచేసే ఉద్యోగులు అటు తిరుపతి నుంచి పీలేరుకు, కొంతమంది మదనపల్లెకు.. మరికొంతమంది కడప నుంచి మదనపల్లె, రాయచోటి ప్రాంతాలకు ప్రతినిత్యం సొంత వాహనాల్లోనే వెళ్లే పరిస్థితి ఏర్పడింది. రాయచోటి నుంచి ఎక్కువ మంది మదనపల్లె వాహనాల్లో వస్తుండగా, పీలేరు నుంచి తిరుపతి, మదనపల్లె నుంచి బెంగళూరుకు సొంత వాహనాలు సమకూర్చుకుని వెళుతున్నారు.
సొంత జిల్లా మంత్రి అయినా
అందని కొత్త బస్సులు
అన్నమయ్య జిల్లా పరిధిలో మదనపల్లె–1, మదనపల్లె–2 డిపోలతోపాటు రాయచోటి, పీలేరు, పుంగనూరు డిపోలు ఉన్నాయి. ఈ ఐదు డిపోల పరిధిలో లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నా అందుకు తగ్గట్టుగా కొత్త బస్సులు రాలేదు. గతంలో ఏదో ఒకటో, అరో వచ్చాయి తప్ప అనుకున్న మేర రాలేదు. జిల్లాకు సంబంధించి మదనపల్లె, రాయచోటికి ఎలక్ట్రిక్ బస్సులు పదుల సంఖ్యలో వస్తాయని ప్రచారం జరుగుతున్నా ఇప్పటికీ అతీగతీ లేదు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రాతినిద్యం వహించే సొంత జిల్లా నేపధ్యంలో భారీగా బస్సులు వస్తాయని ఆశిస్తున్నా నూతన బస్సుల రాక మాత్రం కనిపించడం లేదు. అధికారులు ఇప్పటికై నా స్పందించి జిల్లాకు తక్షణమే కొత్త బస్సులను కేటాయించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
మదనపల్లె బస్టాండులో బస్సుల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణీకులు
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. బస్సుల సమయపాలన సరిగ్గా లేకపోవడంతో పాటు తీవ్రమైన బస్సుల కొరత కారణంగా నిత్యం ప్రయాణికులు ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. ఒక బస్సు పూర్తిగా నిండిపోయి కనీసం నిలబడేందుకు కూడా స్థలం లేకపోవడంతో, ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బస్సును వదిలేసి తదుపరి బస్సు కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. గతంలో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 66 శాతం ఉండగా, ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగి అది 85 శాతానికి మించి నమోదువుతోంది. ప్రయాణికుల శాతం పెరిగినా బస్సులు మాత్రం పెంచనందున గమ్యస్థానాలకు చేరాలంటే నిరీక్షణ అలవాటుగా మారింది.


