కడప సెవెన్‌రోడ్స్: విద్యుత్ ఉత్పాదన పేరిట శ్రీశైలం నీటిని దిగువకు తరలించడాన్ని వెంటనే ఆపాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సీఆర్‌వీ ప్రసాద్‌రావు అధ్యక్షతన గురువారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కోస్తాలో సాధారణ వర్షపాతం, భూగర్భ జలాలు అధికంగా ఉంటాయని.. అక్కడ 40 శాతం లోటున్నా అది సీమ వార్షిక సగటు కంటే ఎక్కువేనన్నారు. ఎల్‌నినో వల్ల మున్ముందు వర్షాలు పడవని.. మార్చి, ఏప్రిల్ నాటికి తాగునీటి కష్టాలు తీవ్రమవుతాయని హెచ్చరించారు. పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తిస్థాయిలో 44 వేల క్యూసెక్కుల నీరు రావాలంటే శ్రీశైలంలో 875 అడుగుల మట్టం నిర్వహించి, ఆపై వచ్చే నీటినే దిగువకు వదలాలన్నారు. ఎగువన అల్మట్టి, జూరాల వంటివి నిండిన తర్వాతే నీరిస్తుంటే, శ్రీశైలం నిండకముందే కిందికి వదలడం అన్యాయమన్నారు. గోదావరి నుంచి ఈ యేడు 800 టీఎంసీలు సముద్రం పాలయ్యాయని, పోలవరం పూర్తయి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. అలాగే, బ్రహ్మంసాగర్ నుంచి లిఫ్ట్ ద్వారా కాకుండా గుర్రంగుంపు రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా కడప నగర దాహార్తిని తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసులు, ఓబయ్య, ఆంజనేయులు, దేవర శ్రీకృష్ణ, పెంచలయ్య, ప్రభాకర్‌రెడ్డి, మధు, కిశోర్, పవన్, రసూల్ తదితరులు పాల్గొన్నారు.


