పీలేరు : ఓ ప్రయివేట్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి అయిన సంఘటన పీలేరు పట్టణంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేవీపల్లె మండలం ఎంవీపల్లె పంచాయతీ జాండ్రపేటకు చెందిన కె.సురేంద్ర (42) కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వైదం కోసం బుధవారం పీలేరు పట్టణంలోని ఎస్‌కేఆర్ హాస్పిటల్‌లో చేరాడు. గురువారం ఆయనకు ఆపరేషన్ చేయడానికి రూ. 35 వేలు తీసుకుని ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ చేసే ముందు మత్తు మందు ఇచ్చారు. అయితే మత్తుమందు ఇచ్చిన కొద్ది సేపటికే సురేంద్ర అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. సురేంద్ర పరిస్థితి విషమంగా ఉందని హాస్పిటల్ యాజమాన్యం హుటాహుటిన వారి అంబులెన్స్‌లోనే తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఎస్‌కేఆర్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో పీలేరులో సురేంద్ర మృతి చెందాడని, మృతదేహాన్ని హడావిడిగా తిరుపతికి పంపించారని ఆరోపించారు. ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుని బాధితకులకు న్యాయం చేయాలని సీపీఐ నాయకులు కందారపు మురళి, సుబ్రమణ్యం డిమాండ్ చేశారు.


