మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బసినికొండలోని మొలకలదిన్నె క్రాస్ వద్ద ఉన్న హెరిటేజ్ డెయిరీలో ల్యాబ్ ఇనన్‌చార్జిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. చిత్తూరు జిల్లా ఐనవీడు గ్రామానికి చెందిన పి.పట్టాభి కుమారుడు పి.సుబ్రహ్మణ్యం(56) కొంతకాలంగా హెరిటేజ్ పాల డెయిరీలో ల్యాబ్ ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి నైట్ డ్యూటీకి వచ్చిన ఆయన గురువారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ల్యాబ్ నుంచి బయటకు వచ్చి డెయిరీ ఆవరణలో తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల ఫుటేజీలో నమోదైందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత డెయిరీ ఆవరణలోనే అచేతనంగా పడి ఉండటాన్ని తోటి సిబ్బంది గుర్తించి వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సుబ్రహ్మణ్యం మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆస్పత్రి ఔట్ పోస్ట్ పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


