● విద్యార్థుల ఆందోళన
● ఉపాధ్యాయులను సైతం లోపలికి వెళ్లనివ్వకుండా గేటుకు తాళం
రాజంపేట టౌన్ : మేము స్కూల్‌కు వెళ్లాలంటే హిందీ ఉపాధ్యాయిని ప్రశాంతిని బదిలీ చేయాల్సిందేనని రాజంపేట మండలం గుండ్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు తేల్చిచెప్పారు. హిందీ ఉపాధ్యాయిని ప్రశాంతిని బదిలీ చేయాలన్న డిమాండ్‌తో గురువారం స్కూల్ విద్యార్థులు వారి తల్లిదండ్రుల సహకారంతో పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. కాగా డిప్యూటీ ఈఓ నాగయ్య, ఎంఈఓ నారాయణరావు అదే సమయంలో పాఠశాల వద్దకు చేరుకున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశాంతిని గుండ్లూరు హైస్కూల్ నుంచి బదిలీ చేసేవరకు తమ పిల్లలను పాఠశాలకు పంపమనిచెప్పి, సమస్యను తెలియచేస్తున్న సమయంలోనే ప్రశాంతి స్కూల్‌కు రావడంతో ఆమెను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాలకు రావద్దంటూ అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోయేలా ఉండటంతో విషయాన్ని డిప్యూటీ ఈఓ ఫోన్ ద్వారా డీఈఓ షంషుద్దీన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రశాంతిని అక్కడి నుంచి వెళ్లిపోయి స్పెషల్ డ్యూటీకి అప్‌లై చేసుకోమని చెప్పాలని డీఈఓ ఫోన్‌లోనే డిప్యూటీ డీఈఓకు సూచించారు. దీంతో డిప్యూటీ ఈఓ డీఈఓ చెప్పిన విషయాన్ని ఆమెకు చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. అనంతరం నాగయ్య విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ సమస్యను డీఈఓ దృష్టికి తీసుకెళ్లానని, రెండు, మూడు రోజుల్లోనే పరిష్కరిస్తానని డీఈఓ చెప్పారన్నారు. అందువల్ల విద్యార్థుల చదువును దృష్టిలో ఉంచుకొని పాఠశాల సజావుగా జరిగేలా సహకరించాలని తల్లిదండ్రులను కోరారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు శాంతించి ఇకపై ప్రశాంతి గుండ్లూరు ఉన్నత పాఠశాలకు వస్తే ఒప్పుకోమని, ఎన్నిరోజులైనా పాఠశాల జరగనివ్వకుండా అడ్డుకుంటామని డిప్యూటీ ఈఓకు స్పష్టం చేశారు. అనంతరం తల్లిదండ్రులు పాఠశాల గేటుకు తాళం తీయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ తరగతి గదులకు వెళ్లిపోయారు.


