● మదనపల్లెలో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణాలకు కేంద్రం సిద్ధం
● డీపీఆర్, సర్వే, మట్టి పరీక్షలకు
రూ.20 లక్షల మంజూరు
● భూమి మార్పు విషయంలో
బాబు సర్కారు నిర్లక్ష్యం
సాక్షి, మదనపల్లె: సీఎం చంద్రబాబునాయుడు ప్రజలకు మంచి చేయరు.. ఇతరులు చేస్తున్నా చూసి సహించలేరు.. ఆది నుంచి బాబు వైఖరి ఇదే. తాజాగా కేంద్రీయ విద్యాలయ నిర్మాణంలోనూ ఇది రుజువైంది. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కేంద్రంతో మాట్లాడి మదనపల్లెకు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించారు. అంతే.. చంద్రబాబు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. మొన్నటివరకు కేంద్రీయ విద్యాలయ తరగతులను ప్రారంభించేందుకు మోకాలొడ్డిన చంద్రబాబు సర్కార్.. తాజాగా విద్యా సంస్థ భవన నిర్మాణాలకు కేటాయించిన భూమి విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తోంది. ఫలితంగా పక్కా భవనాల నిర్మాణానికి అడ్డంకిగా మారింది.
కేటాయింపుతో సరి
కేంద్రీయ విద్యాలయానికి పక్కా భవనాల మంజూరు కోసం మదనపల్లె రూరల్ మండలం వలసపల్లి గ్రామంలో జవహర్ నవోదయ విద్యాలయానికి సమీపంలో 6.09 ఎకరాల భూమిని కేటాయించారు. సర్వే నంబర్ 713/3 లో 0.40 ఎకరాలు, 713/4లో 2.42 ఎకరాలు, 496/2లో 3.02 ఎకరాలు, 496/3లో 0.25 ఎకరాలను కేటాయించారు. 2025 మే 5న అప్పటి కలెక్టర్ శ్రీధర్ భూమి అప్పగింతపై ఆదేశాలు ఇచ్చారు. కేవీ సంఘటన్ ఉన్నతాధికారులకు లేఖ అందజేశారు. ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలు ఆగిపోయాయి.
రూ.10 కోట్లతో భవనాలు
విద్యాలయానికి కేటాయించిన భూమిలో రూ.10 కోట్లతో పక్కా భవనాలను నిర్మించేందుకు కేంద్ర విద్యాశాఖ సిద్ధమైంది. దీనికోసం ఈ ఏడాది ఫిబ్రవరి 19న రూ.20 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో స్థల సర్వే, మట్టి పరీక్షలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందజేయాలని ఉత్తర్వు జారీ చేసింది. ఈ పనుల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ స్టీల్ వర్క్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్‌కు అప్పగించింది. ఈ చర్యలు ఇప్పటికే పూర్తయ్యాయి. భవనాల డిజైన్ కూడా సిద్ధం చేశారు. భూమిలో జి ప్లస్ టు భవనాలు, అందులో లిఫ్టు, మరో తొమ్మిది భవనాలను నిర్మిస్తారు.
మ్యూటేషన్ చేస్తేనే పనులు
కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన 6.09 ఎకరాల భూమిని సంస్థ పేరు మీద వెబ్ ల్యాండ్‌లో మ్యూటేషన్ చేయాలని కేవీ అధికారులు సబ్ కలెక్టర్‌కు లేఖ రాశారు. ఈ ఏడాది జూన్ 9న రాసిన ఈ లేఖకు ఇంతవరకు రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. విద్యాలయం పేరుతో కేటాయించిన భూమి వెబ్ ల్యాండ్ లో మ్యూటేషన్ చేస్తే తప్ప పనులు ప్రారంభమయ్యే అవకాశం లేదని కేవీ అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోవడం నిర్మాణాలకు అడ్డంకిగా మారింది. ఎంపీకి పేరొస్తుందన్న కారణంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.
రీ సర్వే అడ్డమట
విద్యాలయానికి కేటాయించిన భూమిని కేవీ పేరుతో మ్యూటేషన్ చేయడానికి వలసపల్లి గ్రామంలో జరుగుతున్న రే సర్వే అడ్డంకిగా మారిందని రెవెన్యూ అధికారులు చెప్పారని విద్యాలయ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం విద్యాలయం విషయంలో చిత్తశుద్ధి ప్రదర్శిస్తే సమస్య పరిష్కరించే అవకాశం ఉంటుంది. రాజకీయాలు పక్కనబెట్టి సత్వర చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


