● నెల వేతనం రూ.10 వేలే
● ఉద్యోగం 8 నెలలే
సాక్షి, మదనపల్లె: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా వలంటీర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఖాళీగా ఉన్న పాఠశాలలో విద్యార్థులకు చదువు చెప్పేందుకు అర్హులైన వారిని దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తుల గడువు ముగియడంతో మంగళవారం స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందిన దరఖాస్తుల పరిశీలన చేపట్టారు. జిల్లాలో 45 స్కూల్ అసిస్టెంట్, 122 ఎస్‌జీటీ పోస్టులను విద్యా వలంటీర్లతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 119, ఎస్జీటీ పోస్టులకు 591 దరఖాస్తులు వచ్చాయి. అర్హులైన వారిని అధికారులు ఎంపిక చేయనున్నారు. ఎంపికై న స్కూల్ అసిస్టెంట్ విద్యా వలంటీర్లకు నెలకు రూ.12,500, ఎస్టీటీ విద్యా వలంటీర్లకు నెలకు రూ.10వేల వేతనం చెల్లిస్తారు.
ఉద్యోగం 8 నెలలే..
ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులు పాఠశాలల్లో పనిచేయాల్సింది కేవలం 8 నెలల కాలానికే. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు పోస్టులు ఉంటాయి. ఆ తర్వాత ఈ పోస్టులు కొనసాగిస్తారో, తొలగిస్తారో తెలియదు. ఎంపికై న అభ్యర్థులు అతి కొద్ది వేతనంతో పనిచేయాల్సి వస్తుంది.
షరతులు వర్తిస్తాయి
ఏ పాఠశాలలో ఈ పోస్టు ఖాళీగా ఉందో ఆ పాఠశాల పరిధి గ్రామానికి చెందిన అభ్యర్థికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ గ్రామ పరిధికి చెందిన అభ్యర్థి లేకపోతే, ఆ మండలానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేస్తారు.


