● రూపాయికే బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్
● ప్రిన్సిపల్ జీఎం ఏవి.శ్రీకుమార్
సాక్షి, మదనపల్లె: జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ సేవలను విస్తృతం చేస్తున్నామని తిరుపతి టెలికం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఏవి.శ్రీ కుమార్ వెల్లడించారు. మంగళవారం ఆయన డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకోబరావుతో కలిసి మదనపల్లె టెలికం కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఇక్కడి అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదాయంతో సంబంధం లేకుండా జిల్లాలోని 21 మారుమూల గ్రామంలో సెల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డిజిటల్ భారత్ నిధి కార్యక్రమం కింద గుమ్మసముద్రం, అమిలేపల్లి, కత్తిరాయ చెరువు, అరమడకవాండ్లపల్లి, దిగువతాండ, ముడియంవారిపల్లి, చెన్నయ్యగారిపల్లి, బండ్లపై, బూర్లపల్లి, బూచిపల్లి, చెన్నారాయునిపల్లి, కాట్నగల్లు, సంపతికోట, దిగువపల్లె, బండమీదపల్లె, నెక్కంది,ఎలవ నెల్లూరు, బాలిరెడ్డిగారిపల్లె, జుంజురపెంట, బండ్రేవుల్లో టవర్లు ఏర్పాటు చేస్తామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 12వ తేదీ వరకు ఒక రూపాయికే బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ మంజూరు చేస్తామన్నారు. నెలరోజుల టాక్ టైం, రెండు జీబీల ఇంటర్నెట్ ఉచితంగా ఇస్తామన్నారు. సమావేశంలో డిప్యూటీ జనరల్ మేనేజర్లు వెంకోబారావు, జయశంకర్, డీఈ రెడ్డి బాబు, టీఏసి మెంబర్ కరీముల్లా పాల్గొన్నారు.


