లక్కిరెడ్డిపల్లి : ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను లక్కిరెడ్డిపల్లి పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 112 కిలోల బరువు ఉన్న ఆరు ఎర్రచందనం దుంగలు, ఒక మారుతీ స్విప్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ దాదాపు రూ. 9 లక్షల, 72 వేలు ఉంటుందన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు రాయచోటి ఎస్‌డీపీఓ ఎంఆర్ కృష్ణమోహన్ పర్యవేక్షణలో లక్కిరెడ్డిపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణంరాజు నాయక్ సూచనలతో లక్కిరెడ్డిపల్లి ఎస్‌ఐ శోభ, సిబ్బంది దాడులు చేశారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రామానందపురం గ్రామం గుంటిపల్లికి చెందిన దవర్ల దయతోపాటు, లక్కిరెడ్డిపల్లి కుర్నూతల, దేరంగుల రామాంజనేయులు, దక్షనపు రాజశేఖర్, లోకేశ్వర, నాగార్జునలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ లక్కిరెడ్డిపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణంరాజు నాయక్‌ను, ఎస్‌ఐ శోభ, వారి సిబ్బందిని అభినందించారు.
ఐదుగురి అరెస్ట్


