మహమ్మద్‌ ప్రవక్త జీవితం.. ఆదర్శప్రాయం | - | Sakshi
Sakshi News home page

మహమ్మద్‌ ప్రవక్త జీవితం.. ఆదర్శప్రాయం

Aug 26 2026 12:42 AM | Updated on Aug 26 2026 12:42 AM

కడప సిటీ : సర్వమానవాళికి ఆదర్శమూర్తిగా మహా ప్రవక్త మహమ్మద్‌ (సొ.అ.వ) నిలిచారని మత గురువులు తెలియజేస్తున్నారు. అలాంటి మహమ్మద్‌ ప్రవక్త జన్మదినం మిలాద్‌–ఉన్‌–నబీగా ముస్లింలు జరుపుకొంటారు. ఇస్లాం క్యాలెండర్‌ ప్రకారం మూడో నెల రబీ–అల్‌–అవ్వల్‌లో పౌర్ణమి ముందు రోజు మహమ్మద్‌ ప్రవక్త జన్మించినట్టు భావిస్తారు. అనంత కరుణామయుడైన అల్లాహ్‌ సర్వమానవాళి శ్రేయస్సు, శాంతిని నెలకొల్పడం కోసం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్‌ను ఎన్నకున్నట్టు అంతిమ దైవ గ్రంథం పవిత్ర ఖురాన్‌ షరీఫ్‌లో పేర్కొన్నారు. విశ్వ ప్రవక్త మహమ్మద్‌ కేవలం ముస్లింల కోసం కాదని సర్వ కోటి జీవరాశులకు, ఈ విశ్వానికి ప్రవక్తగా అల్లాహ్‌ నియమించారని అందులో తెలిపారు. విశ్వ ప్రవక్త తాను స్వతహాగా ఏదీ తెలియజేయరు. తాను అల్లాహ్‌ ద్వారా ఏది వినేవారే, అదే తెలిపేవారు. దీనికి సాక్ష్యంగా అనేక దైవ గ్రంథాల్లో ముందుగానే వివరించారు. మరో సాక్ష్యం ఏమిటంటే మహమ్మద్‌ ప్రవక్త అక్షరాస్యత తెలియని వారు. ఇది అల్లాహ్‌ తఆలా మహిమ. పవిత్ర ఖురాన్‌ను దైవవాణి రూపంలో ప్రవక్తను అవతరింపజేసి తన శక్తిని సర్వ మానవాళికి తెలియజేశారు. అందుకే విశ్వ ప్రవక్త ప్రవచనాలు సర్వమానవాళి జీవన శైలికి హితోపదేశాలు అయ్యాయి. అల్లాహ్‌కు అత్యంత ప్రీతి పాత్రులైన మహమ్మద్‌ ప్రవక్త ఇస్లాం క్యాలెండర్‌లోని మూడో నెల రబీవుల్‌ అవ్వల్‌ 12వ తేదీ సోమవారం, హిందువుల క్యాలెండర్‌ విక్రమాదిత్య శకం 628 జ్యేష్టశుద్ధ 9వ తేదీ సోమవారం, 570 సంవత్సరం ఏప్రిల్‌ 20వ తేదీ గ్రెగేరియన్‌ క్యాలెండర్‌ (క్రిస్టియన్‌) ప్రకారం సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో జన్మించారని తెలపబడి ఉంది. మక్కా పెద్ద అయిన అబ్దుల్‌ మత్తలబు కుమారుడు అబ్దుల్లా, అమీనాలకు జన్మించారు. మహమ్మద్‌ ప్రవక్త సోమవారం నాడు సూర్యోదయానికి, వేకువజామున మధ్య జన్మించినట్లు, ఆయన పుట్టకముందే తండ్రి మరణించగా, చిన్నతనంలోనే తల్లి కూడా కోల్పోయి అనాథగా పెరిగినట్లు మత గంథ్రాల ద్వారా తెలుస్తోంది. చిన్నతనం నుంచి ఎంతో నిజాయితీగా, మంచి నడతతో ఉండేవారని, అందరూ ఆయన్ను అల్‌ అమీన్‌ అని పిలిచేవారు. కాగా, ఆయనకు 40వ ఏట ప్రవక్త పదవి వరించిందని తెలపబడింది. ఏకోపాసన, మానవులంతా ఒక్కటేనని తారతమ్యాలు లేవని అంతా అల్లాహ్‌ దాసులేనని ఆయన ప్రబోధించారు. శాంతి, సహజీవనం, దానం, దైవభీతితో మెలగాలని బోధించారు. ప్రపంచ మంతటా ఆయన పుట్టిన రోజును పండుగలా చేసుకుంటారు. ఆయన జన్మదిన వేడుకలను ‘మిలాద్‌–ఉన్‌– నబీ’ అని అరబ్బీలో అంటారు.

ప్రత్యేక ప్రార్థనలు

ఇస్లాం సంప్రదాయం ప్రకారం పుట్టిన రోజు, పెళ్లి రోజులను వేడుకలుగా జరుపుకోకూడదు. కానీ భారతదేశంలో మాత్రం ప్రవక్త పుట్టిన రోజున ఆయనను స్మరించుకుంటూ ప్రార్థనలు నిర్వహిస్తారు. దేశంలోని ముస్లింలు తమ పండుగలను ఇస్లాం క్యాలెండర్‌ను అనుసరించే జరుపుకొంటారు. అయితే, ప్రత్యేక పండగలతోపాటు దర్గాలలోని మతపెద్దలు పుట్టిన రోజు లేదా వారి వర్ధంతిని ఘనంగా జరుపుకొనే ఆచారం ఉంది. ఈ రోజున ముస్లింలు ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించి, మత ప్రవక్త ముహమ్మద్‌ను స్మరించుకుని ఆయన చూపిన మార్గంలో నడుస్తామని సంకల్పం చేసుకుంటారు.

రెండు జిల్లాల్లో..

ప్రవక్త జన్మదినం సందర్భంగా ప్రపంచం శాంతి సౌభాగ్యాలతో తులతూగాలని ప్రతి ముస్లిం ప్రార్థించడం గమనార్హం. మిలాద్‌ – ఉన్‌ – నబీ వైఎస్సార్‌ కడప, అన్నమయ్య జిల్లాల్లో బార్మీ నెలగా ప్రసిద్ధి చెందింది. ప్రవక్త జన్మదిన వేడుకల సందర్భంగా రాత్రిళ్లు ఆధ్యాత్మిక సభలు, నాతియాకలామ్‌ (ప్రవక్త కీర్తనలు) నిర్వహిస్తారు. వేకువ జామున నమాజ్‌ తర్వాత బార్మీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ జిల్లాల్లో ముస్లింలతోపాటు హిందువులు కూడా ఎంతో పవిత్రంగా బార్మీ అన్నదానాలు నిర్వహించడం ప్రత్యేకత. ఇది మత సామరస్యానికి నిదర్శనం. ఐకమత్యానికి ఈ రెండు జిల్లాలు ఆదర్శంగా నిలిచాయనడం అతిశయోక్తి కాదు.

ప్రజల శ్రేయస్సు కాంక్షిస్తూ సమాజంలో శాంతి నెలకొల్పేందుకు కృషి

చివరి ప్రవక్తగా భువిపైకి వచ్చినట్లు పవిత్ర గ్రంథం వెల్లడి

నేడు అనంత కరుణామయుడి

జన్మదినం మిలాదున్నబీ

వివిధ సేవా కార్యక్రమాలు

నిర్వహించేందుకు ఏర్పాట్లు

ప్రార్థనా మందిరాల వద్ద పటిష్ట బందోబస్తు

మదనపల్లె టౌన్‌ : మిలాద్‌–ఉన్‌–నబీ పండుగ సందర్భంగా జిల్లాలోని ప్రార్థనా మందిరాలు, మసీదుల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి తెలిపారు. మంగళవారం ఎస్పీ మదనపల్లెలో ఒక ప్రకటన విడుదల చేశారు. ముస్లింలు పండుగను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రార్థనా స్థలాల వద్ద ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే డయల్‌ 100/112 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement