పుంగనూరు : స్థానిక ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్న సిబ్బందిని తక్షణమే రెగ్యులర్ చేయాలని ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మంగళవారం ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలలో ఏళ్లతరబడి తక్కువ వేతనంతో ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి, సమాన పనికి సమాన వేతనం చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై తక్షణమే స్పందించాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ మేరకు మెడికల్ ఆఫీసర్ మధుసూదనాచారికి వినతిపత్రం అందజేశారు.
అధికారుల తీరుపై
డీఎస్వో ఆగ్రహం
పెద్దతిప్పసముద్రం : మండల కేంద్రంలో వంట గ్యాస్ కోసం ప్రజలు నిత్యం రోడ్డెక్కి నిరసనలు, ధర్నాలు చేపడుతున్నా.. స్థానికంగా ఉండే రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని జిల్లా సివిల్ సప్లయ్ (డీఎస్వో) అధికారిణి రెడ్డి చంద్రిక ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎస్వో మంగళవారం సీఎస్‌డీటీ సుబ్బయ్యతో కలసి స్థానిక ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడే ఎందుకు గ్యాస్ కొరత ఏర్పడిందని సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం ఇక్కడ నెలకొన్న గ్యాస్ ఇబ్బందులపై ఆమె సేల్స్ అధికారి (ఎస్వో)ను ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. తరువాత వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి గ్యాస్ గోడౌన్‌ను తనిఖీ చేసారు. అదే విధంగా నాలుగు నెలల క్రితం గ్యాస్ గోడౌన్‌ను విజిలెన్స్ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలో ఏం జరిగింది, తనిఖీ అధికారులు రూ.లక్షల్లో ఎందుకు జరిమానా విధించారు. నెలలో ఎన్ని సిలిండర్లు గోడౌన్‌కు వస్తున్నాయి, ఏజెన్సీ నిర్వాహకులు ఏం సమాధానం చెబుతున్నారు తదితర వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఏది ఏమైనా ఇకపై గ్యాస్ పంపిణీ సక్రమంగా జరిగేలా చొరవ చూపుతామని డీఎస్వో తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు
మదనపల్లె టౌన్ : ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైకు అదుపుతప్పి పడి ఓ డ్రైవర్ కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం పిటిఎం మండలంలో జరిగిన ఘటనపై బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దతిప్పసముద్రం మండలం కాట్నగళ్లుకు చెందిన టెంపో డ్రైవర్ విజయ్‌కృష్ణ(30) సొంత పనిమీద బైక్ లో పీటీఎంకు వెళ్ళాడు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, మార్గమధ్యంలోని కాట్నగళ్లు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి పడి కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. 108 సిబ్బంది సమాచారం అందుకుని వెంటనే బాధితున్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు చికిత్స అందించి అక్కడి నుంచి తిరుపతి రుయాకు రెఫర్ చేశారు.


