● గంటకు పైగా స్తంభించిన ట్రాఫిక్
● పత్తా లేని సివిల్ సప్లయ్ అధికారులు
● ఎట్టకేలకు పోలీసుల చొరవతో గ్యాస్ పంపిణీ
పెద్దతిప్పసముద్రం : స్థానిక ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మంగళవారం మద్దయ్యగారిపల్లి రోడ్డులో గ్యాస్ వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో ధర్నాకు దిగారు. సుమారు గంటకు పైగా ప్రజలంతా సిలిండర్లతో బైఠాయించడంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది. గ్యాస్ బుకింగ్ చేసి ఓటీపీలు చెప్పినా.. సకాలంలో సిలిండర్లను ఇవ్వకపోవడంతోనే తాము ధర్నాకు దిగామని ప్రజలు తెలిపారు. ఏజెన్సీ నిర్వాహకుల తీరును ఎండగడుతూ తీవ్రంగా విమర్శించారు. చుట్టు పక్కల ఎక్కడా లేని విధంగా ఏజెన్సీ వాళ్లు ఇక్కడే గ్యాస్ కొరతను సృష్టిస్తున్నారని మండి పడ్డారు. సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండటంతోనే తమకు ఈ దౌర్భాగ్యం పట్టిందని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. గ్యాస్ కొరతపై ప్రజలు ఎన్ని సార్లు రోడ్డెక్కినా సంబంధిత సివిల్ సప్లయ్ అధికారులు మాత్రం సామాన్య ప్రజల గోడు పట్టించుకోక పోవడంతోపాటు అటు వైపు కన్నెత్తి చూడక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం ప్రజలంతా మూకుమ్మడిగా ఏజెన్సీ నిర్వాహకులతో వాగ్వివాదానికి దిగారు. ఏజన్సీ వారు మాట్లాడుతూ గ్యాస్ బుకింగ్ చేసిన వారంతా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని, తామే గ్రామాలకు వచ్చి సిలిండర్లు అందిస్తామని, తాము ఎక్కడా బ్లాక్‌లో అమ్మలేదని ప్రజలకు వివరించారు.
మీరు సక్రమంగా గ్రామాలకు వస్తుంటే మేమంతా పనులన్నీ మానుకుని ఇక్కడకు ఎందుకు వస్తామని ప్రజలు సూటిగా ప్రశ్నించారు. ఎట్టకేలకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, అత్యవసరంగా ఆసుపత్రులకు వెళ్లే రోగుల అవసరాలను గుర్తించాలని ప్రజలకు హితబోధ చేయగా ధర్నాను విరమించారు. అనంతరం పోలీసులే ఏజెన్సీ వారితో మాట్లాడి దగ్గరుండి గోడౌన్ వద్దే సిలిండర్లను అందించే చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా గోడౌన్ వద్ద పరిస్థితి గందరగోళంగా మారడంతో క్యూలో నిలబడిన వారిలో ముగ్గురు వ్యక్తులు.. ఈ సిలిండర్ నాది అంటే కాదు మాది అంటూ వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.


