● ఇద్దరు వాగ్వాదానికి దిగిన వైనం
● యంత్రాలతో పనులు
● కూలీల పొట్ట కొడుతున్న నేతలు
● కన్నెత్తి చూడని అధికారులు
గాలివీడు : ఉపాధి పనుల కింద గ్రామీణ ప్రాంతాలలో ప్రతి కుటుంబంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం జాబు కార్డును మంజూరు చేసింది. ఎక్కడ కూడా వలస వెళ్లకూడదని.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించింది. ఉపాధిలో ఉన్న నియమ నిబంధనలను గోరంత కూడా ఆచరణలోకి తీసుకురాకుండా అధికారం ఉందని టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు. మరోపక్క గ్రామాలలో వర్గ పోరు మొదలైంది. యంత్రాలతో పనులు చేయడంతో అధిక మొత్తంలో లాభాలు వస్తున్నాయని భావించి తెలుగు తమ్ముళ్లు కుమ్ములాటకు వెనుకాడటం లేదు. ఈ క్రమంలో కూలీల కోసం ఉపాధి హామీ వ్యవస్థ తీసుకొస్తే.. దీనిని చిన్నాభిన్నం చేసి కూలీలు కడుపు కొట్టి రాత్రిపూట యంత్రాలతో పనులను ప్రారంభించారు. మరోపక్క ఆ పనులను అధికారి పార్టీలోనే మరో వర్గం అడ్డుకుంది. ఈ తతంగమంతా గోరాన్‌చెరువు గ్రామంలో గత రెండు రోజుల నుంచి ఘర్షణ వాతావరణంలో జరుగుతోంది. ఒకరికి ఒకరు తగ్గకుండా ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ నేనంటే నేనే చేయాలి అని తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నాయకుడు చెంచు వెంకట్‌రెడ్డి, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీకాంత్ ఉపాధి పనుల కోసం పూర్తి స్థాయిలో వాగ్వాదానికి కూడా దిగినట్లు సమాచారం. గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని కాస్త అక్కడ వాతావరణం అదుపులోకి తీసుకుని వచ్చారు. ఇదే పద్ధతి కొనసాగితే మండల వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు దక్కకుండా బడా నాయకుల చేతిలోకి వెళ్లిపోతుందని మండలంలో చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గాలివీడు మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనితీరుపై నివేదికలు తెప్పించుకొని చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.


