సార్‌.. పరీక్షలు రాయాలి బస్సు ఎక్కించుకోండి! | - | Sakshi
Sakshi News home page

సార్‌.. పరీక్షలు రాయాలి బస్సు ఎక్కించుకోండి!

Aug 26 2026 12:42 AM | Updated on Aug 26 2026 12:42 AM

ఆర్టీసీ సిబ్బందిని వేడుకొన్నా

కనికరించని వైనం

విద్యార్థులను దించేసి వెళ్లిపోయిన సిబ్బంది

గుర్రంకొండ : సార్‌ ఉదయం 8 గంటలకు కళాశాలలో పరీక్షలు రాయాలి బస్సు ఎక్కించుకోండి ప్లీజ్‌ అని వేడుకొన్నా కనికరించకుండా.. విద్యార్థులను కిందకు దించేసి ఆర్టీసీ సిబ్బంది వెళ్లిపోయిన ఘటన మండల కేంద్రమైన గుర్రంకొండలో జరిగింది. బస్సంతా విద్యార్థులే ఎక్కారని, అందరికీ పాస్‌లు ఉన్నాయని, కావున మరో బస్సు ఎక్కాలని సిబ్బంది తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం ఏడు గంటలకు గుర్రంకొండ నుంచి అంగళ్లు, మదనపల్లె పట్టణాల్లోని కళాశాలలకు వెళ్లడానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో స్థానిక బస్టాండుకు చేరుకొన్నారు. విద్యార్థులకు ఈ రోజు ఉదయం 8 గంటలకు కళాశాలలో పరీక్షలు ఉన్నాయి. అప్పుడే కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మదనపల్లె వెళ్లడానికి గానూ గుర్రంకొండ బస్టాండుకు చేరుకొంది. విద్యార్థులంతా హడావిడిగా బస్సు ఎక్కారు. అయితే కొద్ది దూరం వెళ్లిన తరువాత విద్యార్థులందర్ని బస్సు దిగి వెళ్లిపోవాల్సిందిగా ఆర్టీసీ సిబ్బంది కోరారు. మాకు పరీక్షలు ఉన్నాయి సార్‌ ప్లీజ్‌ 8 గంటలకు వెళ్లకపోతే పరిక్షలు రాయలేము అని వేడుకొన్నా ఆర్టీసీ సిబ్బంది కనికరించలేదు. అదంతా మాకు సంబంధం లేదు మీరంతా బస్సు దిగి వెళ్లిపోండి అంటూ దారి మధ్యలో విద్యార్థులను బస్సులోంచి దించేసి వెళ్లిపోయారు. దీంతో విద్యార్థులు ఆవేదన చెందుతూ మళ్లీ బస్టాండుకు చేరుకొన్నారు. అయితే మళ్లీ ఇంకో బస్సు వచ్చి వారు కళాశాలలకు వెళ్లే లోపే పరీక్షల సమయం మించిపోయింది. దీంతో విద్యార్థులు ఆర్టీసీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఆవేదన చెందారు. జరిగిన సంఘటనపై విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫోన్ల ద్వారా సమాచారం అందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు బస్టాండుకు చేరుకొని జరిగిన సంఘటనపై కడప ఆర్టీసీ డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ఈవిషయమై కడప ఆర్టీసీ డిపో మేనేజర్‌ నిరంజన్‌ను వివరణ కోరగా ఈ రోజు ఉదయం విద్యార్థుల పట్ల జరిగిన సంఘటన వాస్తవమన్నారు. ఇప్పటికే పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఈవిషయమై తమకు ఫిర్యాదు చేశారన్నారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టిన ఆర్టీసీ సిబ్బందిపై చర్యలు తీసుకొంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement