మదనపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో హైడ్రామా | - | Sakshi
Sakshi News home page

మదనపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో హైడ్రామా

Aug 26 2026 12:42 AM | Updated on Aug 26 2026 12:42 AM

మదనపల్లె టౌన్‌ : అన్నమయ్య జిల్లాలోనే అత్యధిక ఆదాయం వచ్చే మదనపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై కడప ఏసీబీ అధికారులు రెండు రోజుల పాటు సోదాలు జరిపి చివరకు ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందంగా ముగించారు. అవినీతి జరుగుతోందన్న ఫిర్యాదుతో సోమవారం సాయంత్రం ఏసీబీ డీఎస్పీ సీతారామరావు బృందం రహస్యంగా కార్యాలయానికి చేరుకుంది. లోపల ఉన్న సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్లు, రిజిస్ట్రేషన్‌కు వచ్చిన ప్రజలను బయటకు వెళ్లనీయకుండా తలుపులు మూసి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. రికార్డులు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు, బీరువాలు పరిశీలించి రాత్రి రూ.1.25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం మళ్లీ తనిఖీలు కొనసాగించారు. చివరకు మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం రూ.1.25 లక్షల్లో రూ.45 వేలు ప్రభుత్వ సొమ్ము కాగా, మిగిలిన రూ.82 వేలు మాత్రమే లెక్కలో లేని నగదుగా తేలిందన్నారు. లక్షల్లో దొరుకుతుందని భావించిన వారికి ఇది నిరాశ కలిగించింది. జిల్లా కేంద్రం కావడంతో మదనపల్లిలో రోజూ వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయి, ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం వస్తుంది. ఇక్కడ పట్టుబడిన మొత్తం చాలా స్వల్పమని, ఇది ఉన్నతాధికారుల మర్యాదల కోసం ఉంచే డబ్బే అయి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ పేరు చెప్పి కొంత మంది ప్రైవేట్‌ డాక్యుమెంట్‌ రైటర్లే ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారని, వారి వల్లే ఈ ఫిర్యాదు వెళ్లి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. రిజిస్ట్రేషన్లు ఆగి పోవడంతో క్రయవిక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు రోజులు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో సహనం కోల్పోయిన ప్రజలు ఏసీబీ అధికారులతో గొడవకు దిగారు. దీంతో పరిస్థితి చేయిదాటుతుందని గ్రహించిన ఏసీబీ అధికారులు సోదాలు ముగిశాయని, మధ్యాహ్నం హడావిడిగా ప్రెస్‌ మీట్‌ పెట్టి ఖాళీ చేతులతో వచ్చిన దారి పట్టుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు ఏసీబీ అధికారులు ఉన్నతాధికారులకు ఇవ్వనున్న నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఏసీబీకి దొరికింది రూ.82 వేలే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement