గుర్రంకొండ : నీరు ఎండిపోయిన బావిలో గుర్తుతెలియని ద్విచక్రవాహనం బయటపడిన సంఘటన మండలంలోని సరిమడుగు పంచాయతీ నాగరాజపురం వద్ద జరిగింది. గ్రామానికి సమీపంలో రంగరాయపు బావి అనే పేరుతో పురాతన బావి ఉంది. బావిలో చాలా ఏళ్లుగా నీరు ఇంకిపోకుండా అలాగే ఉండేది. ఈ బావి నీటితో రైతులు వ్యవసాయం చేసేవారు. ప్రస్తుతం కరువు పరిస్థితి కారణంగా బావిలో నీరు ఇంకిపోయింది. అయితే ఆశ్చర్యకంగా బావిలో ఓ ద్విచక్రవాహనం బయటపడడం గమనార్హం. ఇటీవల వీబీరామ్‌జీ పనుల చేయడానికి వెళ్లిన కూలీలు బావిలో ద్విచక్రవాహనం ఉన్నట్లు గుర్తించారు. హీరో హోండా స్ప్లెండర్ ఫ్లస్ వాహనం బావిలో పడిఉన్న విషయం గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అసలు బావిలోకి ఈ ద్విచక్రవాహనం ఎలా వచ్చి పడింది అనేది పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా నేరం చేసి వాహనాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా లేక ఎర్రచందనం కేసుల్లో గానీ, చోరీలకు గానీ ఈ వాహనాన్ని వినియోగించి ఆధారాలు దొరక్కకుండాబావిలో పడేశారా అనే సందేహాలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇలా బావిలో ద్విచక్రవాహనం బయటపడడం చర్చనీయాంశంగా మారింది.


