● త్వరలో వినాయక చవితి
వేడుకలు ప్రారంభం
● ఉత్సవాల ఏర్పాట్లు ఆరంభించిన కమిటీలు
రాయచోటి అర్బన్ : పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వాడవాడలా ఘనంగా జరుపుకొనే వేడుక వినాయక చవితి. అందుకే గణపయ్య పండుగ వస్తుందంటే అన్ని ప్రాంతాల్లో నెల రోజుల ముందు నుంచే యువకులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు వేగవంతం చేస్తారు. సెప్టెంబర్ 14 నుంచి వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్నాయి. మరో మూడు వారాలు మాత్రమే సమయం ఉండటంతో.. అనేక ప్రాంతాల్లోని ఉత్సవ కమిటీలు ఏర్పాట్లను మొదలు పెట్టారు. ఒకప్పుడు పెద్ద నగరాల్లోనే వైభవంగా జరిగే వేడుకలు.. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ ఘనంగా జరుగుతున్నాయి. అందువల్ల విగ్రహాల తయారీ కళాకారులు.. గణనాథుడి విగ్రహాలను సర్వ హంగులతో సిద్ధం చేశారు.
ఆకర్షణీయమైన రంగులపై ఆసక్తి
నేటి యువత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండే లంబోదరులను కొలువు దీర్చేందుకు ఇష్టపడుతున్నారు. అందువల్ల కళాకారులు ప్రతి ఏడాది కొత్త డిజైన్లలో విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా సరికొత్త డిజైన్లలో విగ్రహాలను వ్యాపారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే పలు ఉత్సవ కమిటీ ప్రతినిధులు కంప్యూటర్‌లో గ్రాఫిక్స్ ద్వారా విగ్రహాన్ని రూపొందించి, ఆ తరువాత రంగులు వేయించుకుంటున్నారు.
ఉత్సవ కమిటీల ఉత్సాహం
వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో ఉత్సవ కమిటీల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇప్పటికే అనేక ఉత్సవ కమిటీల ప్రతినిధులు విగ్రహాలను బుక్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక ఉత్సవాల నిర్వహణ కోసం వారి ప్రాంతాల్లో చందాలను వసూలు చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు కోసం అడ్వాన్స్‌లు ఇచ్చి కళాకారులను బుక్ చేసుకుంటున్నారు.
మొదలైన విక్రయాలు
రాయచోటి పట్టణంలోని పలు ప్రాంతాల్లో విగ్రహాలను అమ్ముతున్నారు. గతంలో కంటే ఈ ఏడాది ధరలు పెరిగాయి. రాయచోటిలో 8 అడుగుల విగ్రహాలు రూ.20 వేల నుంచి 25 వేలు, 10 అడుగుల విగ్రహాలు రూ.28 వేల నుంచి 30 వేలు, 11 అడుగుల విగ్రహాలు రూ.32 వేల నుంచి 40 వేల వరకు పలుకుతున్నాయి. గతేడాది జరిగిన ఉత్సవాల్లో లడ్డూను వేలంలో దక్కించుకున్న వారు కొందరు, కొత్తగా స్వామి వారి మీద మొక్కుబడి ఉన్నవారు కొందరు విగ్రహాలను కొనుగోలు చేస్తుండగా.. ఎక్కువ శాతం ఆనవాయితీగా వస్తున్న చందాల రూపంలో మరి కొందరు విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. మరో వైపు ఆర్కెస్ట్రాలకు రూ.30 వేల నుంచి 60 వేలు వరకు డిమాండ్ నెలకొంది.


