ములకలచెరువు : మండలానికి చెందిన ఒక వ్యక్తి ఇద్దరు బాలికలను లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటన తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన మహబూబ్‌బాషా(55)ను సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ దస్తగిరి తెలిపారు. సీఐ మాట్లాడుతూ నిందితుడు చౌడసముద్రం గుడి వద్ద ఉండగా అరెస్టు చేశామన్నారు. నిందితుడిని తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు సీఐ వెల్లడించారు.
బాధిత కుటుంబానికి
న్యాయం చేయాలి
మదనపల్లె టౌన్ : లవ్ జిహాదీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ జనతా వారధి ఆధ్వర్యంలో మదనపలె బీజేపీ నాయకులు మదనపల్లె ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి సోమవారం ఫిర్యాదు చేశారు. కాకినాడలో ఇంటర్నేషనల్ స్కూల్లో రైఫిల్ షూటింగ్ శిక్షకుడిగా పని చేస్తున్న సాధిక్ ఖాన్ వల్లే ఈ ఘటన జరిగిందని, ఈ కేసులో వంచన, మోసం, దోపిడీ, హత్య కోణాలున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు, నేతలు ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, రాష్ట్ర సీఎం, హోం మంత్రి స్పందించాలని కోరారు.
బాలిక అదృశ్యంపై ఫిర్యాదు
మైదుకూరు : మైదుకూరులో బాలిక అదృశ్యంపై సోమవారం ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. తన మనవరాలు పదో తరగతి పూర్తి చేసి ఇంట్లోనే ఉండేదని, సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయిందని, బాలిక ఆచూకీ తెలియజేయాలని కోరుతూ బాలిక నాయనమ్మ ఫిర్యాదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఆ మేరకు కేసు నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
చక్రాయపేట : ఎలాంటి బిల్లులు లేకుండా వేరుశనగ పప్పును తీసుకెళుతున్న లారీని విజిలెన్స్ సీఐ పట్టుకొని చక్రాయపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. యల్లటూరు నుంచి వేరుశనగ పప్పుతో కదిరి వైపు వెళుతున్న లారీని అద్దాలమర్రి క్రాస్ వద్ద విజిలెన్స్ సీఐ శ్రీనివాసుల రెడ్డి పట్టుకున్నారు. పప్పునకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో కేసు నమోదు చేసి లారీని చక్రాయపేట స్టేషన్‌కు అప్పగించారు. ఈ విషయమై చక్రాయపేట ఎస్‌ఐ చంద్రశేఖర్‌ను అడగగా.. విజిలెన్స్ సీఐ పప్పు శనగ లారీ పట్టుకుని అప్పగించారని తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
మైలవరం (జమ్మలమడుగు రూరల్) : గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైలవరం మండలంలో చోటు చేసుకొంది. ఎస్‌ఐ శ్యాం సుందర్‌రెడ్డి ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీకి చెందిన దాసుగారి రాజా (64) గత 5 ఏళ్ల క్రితం బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. అంతే కాకుండా మానసిక పరిస్థితి బాగ లేకపోవడంతో పలుమార్లు ఇంటి నుంచి బయటికి వెళ్లేవాడు. సోమవారం కూడా అలాగే ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. సాయంత్రం మైలవరం జలాశయంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అతన్ని బయటికి తీయగా అప్పటికే మృతి చెందాడు.
ప్రైవేట్ బస్సు ఢీకొని
ఇద్దరికి గాయాలు
గుత్తి రూరల్ : ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రఘురామయ్య, నంద్యాల జిల్లా గోరుమానుపల్లికి చెందిన చెక్క శివయ్యలు సోమవారం వైఎస్సార్ కడప జిల్లాకు బైక్‌లో బయలుదేరారు. కొత్తపేట గ్రామ శివారులో వీరి బైక్‌ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన రఘురామయ్య, శివయ్యను స్థానికులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


