తంబళ్లపల్లె : నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండ ఆలయ అభివృద్ధి ఘనత ముమ్మాటికీ పెద్దిరెడ్డి కుటుంబానికే దక్కుతుందని, అది చరిత్రలో నిలిచిపోతుందని మల్లయ్యకొండ దేవస్థానం మాజీ చైర్మన్ కనుగొండ మద్దిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డిలు కోట్లాది రూపాయల నిధులతో మల్లయ్యకొండలోని ఆలయాలను పునఃనిర్మించారన్నారు. తిరుమల తరహాలో 36 మలుపులతో ఘాట్‌రోడ్డు నిర్మించి కర్ణాటక, చైన్నె, రాయలసీమ జిల్లాల భక్తులకు మల్లికార్జునస్వామి దర్శన భాగ్యం కల్పించారన్నారు. అలాంటి పవిత్ర మల్లయ్యకొండ, సాధుకొండ, ఇనుముకొండ సముదాయంలో కూటమి ప్రభుత్వం మైనింగ్ చేపట్టేందుకు ప్రయత్నించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. మైనింగ్‌కు వ్యతిరేకంగా ’మల్లయ్యకొండ పరిరక్షణ సమితి’ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ అభినందనీయమన్నారు. అందరూ ఏకమై మల్లయ్యకొండను మైనింగ్ బారి నుంచి రక్షించుకుంటామని, ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మైనింగ్ చర్యలను పూర్తిగా విరమించుకోవాలని మద్దిరెడ్డి డిమాండ్ చేశారు.


