కురబలకోట : అన్నమయ్య జిల్లాలో రవాణా, వాణిజ్య రంగాల అభివృద్ధికి ఊతమిచ్చేలా కురబలకోట రైల్వే స్టేషన్ సమీపంలోని అరవిందపురం వద్ద ‘గతి శక్తి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్’ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇందుకు అవసరమైన స్థలాన్ని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, రైల్వే ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదట సీటీఎం, వాయల్పాడు ప్రాంతాలను పరిశీలించినప్పటికీ.. తగినంత భూమి, భౌగోళిక అనుకూలత కురబలకోటలోనే మెరుగ్గా ఉండటంతో అధికారులు ఇక్కడే ప్రాజెక్టు ఏర్పాటుకు మొగ్గు చూపారు. రైల్వే శాఖ ఆధీనంలో ఉండే ఈ ఐదు ఎకరాల స్థలంలో భారీ గోదాములు, లోడింగ్, అన్‌లోడింగ్ యార్డులు నిర్మిస్తారు. సరుకుల రవాణా సులభంగా జరిగేందుకు వీలుగా ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి ఈ పార్కు వరకు ప్రత్యేకంగా రైల్వే ట్రాక్, కొత్త ప్లాట్‌ఫాం నిర్మించనున్నారు. ఈ పార్క్ అందుబాటులోకి వస్తే అన్నమయ్య జిల్లాతో పాటు రాయలసీమలోని టమాటా, మామిడి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా దేశంలోని వివిధ మార్కెట్లకు గూడ్స్ రైళ్ల ద్వారా వేగంగా తరలించే అవకాశం కలుగుతుంది. దీనివల్ల వ్యాపారులకు రవాణా వ్యయం తగ్గి, కురబలకోట కీలక రవాణా కేంద్రంగా మారి స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని జేసీ తెలిపారు. ఈ పర్యటనలో తహసీల్దారు ధనుంజయులు, అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీరు జి.నరసింహులు, రైల్వే ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్థలాన్ని పరిశీలించిన జేసీ, సబ్ కలెక్టర్


