భర్తను చంపిన మహిళ, ఆమె ప్రియుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

భర్తను చంపిన మహిళ, ఆమె ప్రియుడి అరెస్ట్‌

Jul 1 2026 2:46 AM | Updated on Jul 1 2026 2:46 AM

మదనపల్లె టౌన్‌ : పరాయి పురుషుడి మోజులో పడి భర్తను అత్యంత కిరాతకంగా రుబ్బురాళ్లతో కొట్టి హత్య చేయించి, ఆపై దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య, ఆమె ప్రియుడి గుట్టును మదనపల్లె పోలీసులు రట్టు చేశారు. ఈ హత్య కేసు వివరాలను మదనపల్లె అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) ఎం. వెంకటాద్రి వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం మీడియాకు వెల్లడించారు. మదనపల్లె మండలం నారమాకుల తండాకు చెందిన బుక్య చిన్నబుడ్డన్న నాయక్‌ (36) భార్య రమీల (30)కు, బుక్యా రెడ్డెప్ప నాయక్‌ (40)తో అక్రమ సంబంధం ఉంది. భర్త తనను మందలించినా మారలేదు. దీంతో చిన్నబుడ్డన్న నాయక్‌ మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో రమీల ప్రియుడితో కలిసి ఈ నెల 18న రాత్రి భర్త తలపై రుబ్బురోలుతో కొట్టింది. ఆపై ఇద్దరూ కలిసి మరోసారి రుబ్బురాయితో బాది చిన్నబుడ్డన్నను హతమార్చి, మృతదేహాన్ని మదనపల్లి–రామసముద్రం రోడ్డులోని దండువారిపల్లె వద్ద రోడ్డుపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించారు. అయితే ఇంట్లో ఉన్న రక్తపు మరకలు, రుబ్బురాయి గుర్తులను కుటుంబీకులు పసిగట్టి కలెక్టరేట్‌, ఎస్పీ ఆఫీస్‌ ముట్టడించి ధర్నా చేపట్టారు. దీనిపై జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ప్రత్యేక చొరవ చూపి దర్యాప్తును వన్‌ టౌన్‌ సీఐ రాజారెడ్డికి అప్పగించారు. సీఐ రాజారెడ్డి, ఎస్‌ఐలు చంద్రశేఖర్‌, రహీముల్లా, సతీష్‌లతో కలిసి లోతుగా దర్యాప్తు చేపట్టి పక్కా ఆధారాలతో రమీల, ఆమె ప్రియుడు రెడ్డెప్ప నాయక్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. అక్రమ సంబంధం కోసమే చంపేసి, శవాన్ని బైక్‌పై తీసుకెళ్లి రోడ్డు ప్రమాదంగా డ్రామా ఆడామని ఒప్పుకోవడంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement