మహిళలపై భూకబ్జాదారుల దాడి! | - | Sakshi
Sakshi News home page

మహిళలపై భూకబ్జాదారుల దాడి!

Jul 1 2026 2:46 AM | Updated on Jul 1 2026 2:46 AM

మదనపల్లె టౌన్‌ : దుబ్బిగానిపల్లిలో భూముల ధరలు పెరగడంతో కబ్జాదారులు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. వారసత్వ భూమి వివాదంలో ఆదివారం ఇద్దరు మహిళలపై భీకర దాడి జరగ్గా, సోమవారం మరోచోట ప్రహరీ కూల్చివేత ఘటన చోటుచేసుకుంది. ఈ రెండు దౌర్జన్యాలపై తాలూకా పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. దుబ్బిగానిపల్లికి చెందిన అక్కచెల్లెళ్లు అలివేలమ్మ, లక్ష్మీదేవిలకు.. నాగరాజుకు మధ్య సర్వే నంబర్‌ 220–2లోని 55 సెంట్ల స్థలం విషయంలో సివిల్‌ కోర్టులో కేసులు నడుస్తున్నాయి. వివాదం సాగుతుండగానే నాగరాజు అందులో కొంత భూమిని జి.రామకృష్ణ, జి.గోపాల్‌లకు విక్రయించాడు. కొనుగోలుదారుల తరఫున చలపతి, మల్లికార్జున, వేణు, లోకేష్‌లు ఆదివారం అక్కడ కంచె వేయడానికి ప్రయత్నించగా లక్ష్మీదేవి, అలివేలమ్మలు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన నిందితులు క్రికెట్‌ బ్యాట్లు, రాళ్లతో మహిళలపై భీకర దాడి చేసి గాయపరిచారు. బాధితులు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే అదునుగా సోమవారం దుబ్బిగానిపల్లిలోనే జి.వెంకటరమణ, జి.వెంకటరత్నంలకు చెందిన సర్వే నంబర్‌ 332, 334లోని 78 సెంట్ల స్థలం చుట్టూ ఉన్న రాతి ప్రహరీని ప్రత్యర్థులు అక్రమంగా కూల్చివేశారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు రాజగోపాల్‌, బాలగంగాధర్‌, రామకృష్ణ, గురప్ప, హరినాథ్‌, సి.వి.చలపతి, అరవింద్‌, మల్లికార్జున, చరణ్‌, రెడ్డిప్రణీత్‌, శివ అనే టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement