జమ్మలమడుగు: ముఖ్యమంత్రి చంద్రబాబు కడప ఉక్కుపై మళ్లీ చేయబోయే నకిలీ శంకుస్థాపనల రంగులు బయటపడకుండా చూసేందుకు కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని అప్రజాస్వామిక పర్వానికి తెరలేపింది. జమ్మలమడుగు మండల పరిధిలోని సున్నపురాళ్లపల్లె, కన్యతీర్థం వద్ద గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కల్పించిన మౌలిక వసతులు, జిందాల్ సంస్థ చేపట్టిన పనుల తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బుధవారం వస్తున్న వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణ బృందాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం సాయంత్రం జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డికి అర్బన్ సీఐ నరేష్‌బాబు ముందస్తు నోటీసులు జారీ చేశారు. స్టీల్‌ప్లాంట్ సందర్శన కార్యక్రమంలో పాల్గొనకూడదంటూ ఆంక్షలు విధించారు. ఒక్క జమ్మలమడుగులోనే కాకుండా ఉమ్మడి కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చే వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులను ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు చేసేందుకు, భారీగా పోలీసు బందోబస్తును మోహరించి అడ్డుకట్ట వేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాము చేపట్టబోయే స్టీల్‌ప్లాంట్ సందర్శనను పోలీసులు అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఉదయం ఉమ్మడి వైఎస్సార్ జిల్లావ్యాప్తంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కలిసి కచ్చితంగా స్టీల్‌ప్లాంట్ స్థలాన్ని సందర్శించి తీరుతామని, క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.
సాక్షి ప్రతినిధి, కడప : ‘ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు, చేయనిది చేసినట్లు’ చెప్పుకోవడంలో సీఎం చంద్రబాబు తర్వాతే మరెవ్వరైనా అని రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. కడప ఉక్కు–రాయలసీమ హక్కు అంటూ గతంలో సాగిన దీక్షలన్నీ బూటకమేనని, శంకుస్థాపనలన్నీ నాటకాలేనని తేలిపోయింది. నాడు విభజన చట్టంలోని అంశాన్ని అమలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోయిన చంద్రబాబు, ఆపై క్షేత్రస్థాయి దీక్షల పేరుతో సరికొత్త నాటకాలకు తెరతీశారు. ఇలా 19 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ఉక్కు పరిశ్రమపై అనేక రాజకీయ ఫీట్లు వేస్తూనే ఉంది. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈమారు తప్పకుండా స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెబుతూ వచ్చారు. గత ఏడాది మే 27న కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడు వేదికపై నుంచి జూన్ 12లోపు ఉక్కు పరిశ్రమ పనులు పునఃప్రారంభిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. తీరా ఆ గడువు ముగిసి ఏడాది దాటిపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు సరికదా.. ఇప్పుడు మళ్లీ పాత కథనే తిరగేస్తూ ఈ నెల 3వ తేదీన ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన మళ్లీ చేసేందుకు సన్నద్ధమవ్వడంపై జిల్లా ప్రజల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్సార్ ‘శ్రీకారం’.. ఆపై రాజకీయ గ్రహణం
రాయలసీమ మెట్ట ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ స్థాపన ద్వారా ప్రత్యక్షంగా 20 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి జీవనోపాధి కల్పించాలని నాడే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మహా సంకల్పం చేశారు. 10 మిలియన్ టన్నుల సామర్థ్యంతో, రూ.20 వేల కోట్ల అంచనా వ్యయంతో బ్రహ్మణి స్టీల్స్‌కు 2007 జూన్, 10న ఆయన పునాది రాయి వేశారు. స్టీల్ ప్లాంట్ పనులు సైతం శరవేగంగా ప్రారంభమై, అప్పట్లోనే సుమారు రూ.1,500 కోట్లతో వివిధ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అంతలోనే వైఎస్సార్ అకాల మరణంతో బ్రహ్మణి స్టీల్స్‌కు రాజ కీయ గ్రహణం ఆవరించింది. తదనంతర కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కుట్రపూరితంగా వ్యవహరించి, ఏకంగా పరిశ్రమకు ఇచ్చిన నీరు, భూకేటాయింపులను సైతం రద్దు చేస్తూ జీవోలు జారీ చేసి రాయలసీమకు ద్రోహం చేశాయి. ఆ తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశాన్ని చేర్చినప్పటికీ, ఆ చట్టాన్ని అమలు చేయించడంలో నాటి కేంద్ర, రాష్ట్ర అధికార భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీ పూర్తిగా నోరెత్తలేకపోయింది.
చిత్తశుద్ధి చాటుకున్న వైఎస్ జగన్ సర్కార్
జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయా లనే విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ చిత్తశుద్ధి చాటుకుంది. తొలుత 2019లో డిసెంబర్ 23న సున్నపురాళ్లపల్లె వద్ద శంకుస్థాపన చేశారు. వెంటనే కరోనా వైరస్ కారణంగా ఎలాంటి పనులు చేపట్టలేదు. తర్వాత దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జేఎస్‌డబ్ల్యూ జిందాల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని 2023 ఫిబ్రవరి, 15న వైఎస్ జగన్ ఘనంగా భూమి పూజ చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఆ రోజు నాటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.725 కోట్ల భారీ నిధులను వెచ్చించి పరిశ్రమకు అవసరమైన నీరు, విద్యుత్, రైల్వే, రోడ్డు కనెక్టివిటీ వంటి మౌలిక వసతులను శరవేగంగా కల్పించారు. రెండు దశల్లో మొత్తం రూ.8,800 కోట్ల పెట్టుబడితో, 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశారు. వైఎస్ జగన్ ఇచ్చి న భరోసాతో జిందాల్ సంస్థ కూడా దాదాపు రూ.1,300 కోట్లు వెచ్చించి క్షేత్రస్థాయిలో వివిధ నిర్మా ణ పనులను వేగవంతం చేసింది. నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సాగిన అదే వేగంతో పనులు కొనసాగి టీడీపీ కొనసాగించి ఉంటే.. ఈపాటికి కడప స్టీల్ ప్లాంట్ నుంచి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభమై, రాయలసీమ నిరుద్యోగ యువతకు వేలాది సంఖ్యలో ఉద్యోగాలు లభించేవి. కానీ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలతో ఆ ప్రాజెక్టును పక్కనబెట్టి, ఇప్పుడు సరికొత్త డ్రామాలకు తెరలేపింది.
నేడు వైఎస్సార్‌సీపీ నేతల సందర్శన
చంద్రబాబు చేయబోయే ఈ నకిలీ శంకుస్థాపనల రంగులు బయటపెట్టేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. సున్నపురాళ్లపల్లె వద్ద జిందాల్ సంస్థ చేపట్టిన పనులు, అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలను బుధవారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ బృందం సందర్శించనుంది. ఉక్కు పరిశ్రమ తీరుతెన్నులను, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని స్వయంగా పరిశీలించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో హాజరు కానున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.
ఉక్కు పరిశ్రమపై లేని చిత్తశుద్ధి
నాడు దీక్ష బూటకం.. శంకుస్థాపన నాటకం
‘మహానాడు’ గడువు ముగిసి ఏడాది దాటినా ముందడుగు లేదు
ఎల్లుండి మళ్లీ శంకుస్థాపనకు
చంద్రబాబు సర్కార్ సిద్ధం
నేడు సున్నపురాళ్లపల్లె స్టీల్ ప్లాంట్ స్థలాన్ని సందర్శించనున్న వైఎస్సార్‌సీపీ నేతలు
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీసులు!
ముందస్తు అరెస్టులకు పోలీసుల స్కెచ్
ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ
ఎన్నికలు దగ్గరపడేసరికి అప్పటి టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి లేని ఆమరణ దీక్షల నాటకాలకు తెరలేపింది. అప్పటి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఏకంగా 11 రోజులు ఆమరణ దీక్ష చేసినట్లు డ్రామాలు ఆడి, కనీసం ఒక కిలో బరువు కూడా తగ్గకుండా దీక్ష విరమించిన గంటలోపే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడం సీమ ప్రజలను వంచించడమేనని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అదే బూటకపు ఊపుతో కేవలం రూ.1.5 కోట్లు మంజూరు చేసి 2018 డిసెంబర్, 27న మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద ‘ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్’ పేరుతో చంద్రబాబు శంకుస్థాపన చేసి ఆపై దాన్ని గాలికి వదిలేశారు. తాజాగా ఈ నెల 3న చంద్రబాబు చేయబోయే ఈ శంకుస్థాపన కూడా రాయలసీమ ప్రజల కంటితుడుపు కోసమేనని స్పష్టమవుతోంది.


