సాక్షి, మదనపల్లె: ఆశలతో ప్రారంభమైన ఈ టమాటా వేసవి సీజన్ రైతులకు కొంత నిరాశ మిగిల్చినప్పటికీ, మొత్తానికి వారిని కోలుకునేలా చేసింది . ఈ ఏడాది మూడు సీజన్లలో కలిపి రికార్డు స్థాయిలో 47,330 ఎకరాల్లో టమాటా సాగు కాగా, ఏప్రిల్ మూడో వారం నుంచి వేసవి సీజన్ ప్రారంభమైంది. జూన్ చివరి వారంలో ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టినా, జూన్ నెల చివరి రోజైన మంగళవారం ధర మళ్లీ పుంజుకోవడంతో మార్కెట్‌లో టమాటా ధరలు దోబూచులాడుతున్నాయి. దీనితో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించినప్పటికీ, మరో 10 రోజుల్లోనే ఈ సీజన్ ముగియనుండటం గమనార్హం.
ఎండల దెబ్బ.. చివర్లో నాణ్యత కరవు
వర్షాలు మొదలుకావాల్సిన ఈ సీజన్‌లో ఎండలు సాధారణ వేసవి కంటే ఎక్కువగా మండించాయి. గతంలో ఎన్నడూ లేని ఈ తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల పూత దెబ్బతినడం, మొక్క వేర్లపై ప్రభావం చూపించడంతో కాయల నాణ్యత దారుణంగా పడిపోయింది. ఫలితంగా టమాటా తోటల్లోనే త్వరగా పక్వానికి రావడం, రవాణా సమయంలో కాయలు మెత్తబడి దెబ్బతినడం వల్ల మార్కెట్‌లో ధరలపై ప్రభావం చూపించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో రైతులు పంట దిగుబడులను నష్టపోవాల్సి వస్తోంది. వేసవిలో పరుగులు తీసిన ధరలుఈ వేసవి సీజన్‌లో టమాటా ధరలు మార్కెట్‌లో పరుగులు తీశాయి. ప్రారంభంలో కిలో అత్యధిక ధర రూ.27 పలకగా, మధ్యలో అత్యధికంగా రూ.42 వరకు పలికింది. జూన్ 10 నుంచి 20 దాకా ధరలు కిలో రూ.20 నుంచి రూ.22 పలుకుతూ నిలకడగా కొనసాగాయి. అయితే జూన్ చివరి వారంలో ధరల్లో తగ్గుదల మొదలై కిలో రూ.17 కు పడిపోయింది. దీనికి తోడు అనంతపురం మార్కెట్ ప్రారంభం కావడం, తమిళనాడు వ్యాపారులు క్రిష్ణగిరి మార్కెట్ వైపు మొగ్గు చూపడం.. ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గడం వల్ల సీజన్ చివర్లో ధరలు కొంతమేర తగ్గాయి. అయితే సీజన్ ముగింపు దశకు వస్తున్న సమయంలో సోమవారం కిలో అత్యధిక ధర రూ.19 పలికితే, మరుసటి రోజైన మంగళవారం కిలో ధరపై ఏకంగా 7 రూపాయలు పెరిగి కిలో రూ.26 పలికింది. ములకలచెరువు మార్కెట్‌లో కూడా సోమవారం కిలో రూ.21 పలికింది. సీజన్ చివరలో మళ్లీ ధరలు పెరగడం వల్ల అందుబాటులో ఉన్న చివరి దిగుబడికి మంచి ధర వస్తుందని రైతులు ఆశలు పెట్టుకుంటున్నారు.
మదనపల్లెకు రికార్డు స్థాయిలో దిగుబడులు
జూన్ రెండో వారం నుంచి చూస్తే రోజుకు 1,400 టన్నులకు తగ్గకుండా ప్రతిరోజూ టమాటా దిగుబడులు మార్కెట్ యార్డ్‌కు తరలివచ్చాయి. అయితే ప్రస్తుతం సీజన్ ముగింపు దశకు చేరడంతో మన దగ్గర నాణ్యత తగ్గడం, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లో దిగుబడులు మొదలవ్వడం వల్ల వ్యాపారుల రాక తగ్గింది. అయినప్పటికీ, స్థానికంగా దిగుబడులు క్రమంగా పడిపోతుండటంతో మార్కెట్‌కు వచ్చే సరుకు కొరత ఏర్పడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి.
కొన్ని మండలాల్లో అతి తక్కువ సాగు
ఉమ్మడి జిల్లా పరిధిలోని కొన్ని మండలాల్లో మూడు సీజన్లలోనూ టమాటా సాగు అత్యంత అల్పంగా నమోదైంది. ఖరీఫ్‌లో గాలివీడులో 281 ఎకరాలు, పీలేరులో 86.88 ఎకరాలు, రామాపురంలో 66.13 ఎకరాల్లో మాత్రమే సాగైంది. రబీలో పీలేరులో 17.11 ఎకరాలు, మదనపల్లెలో 129.48 ఎకరాలు, రాయచోటిలో 37.85 ఎకరాలు, లక్కిరెడ్డిపల్లెలో 22.92 ఎకరాలు, కలికిరిలో 89.48 ఎకరాల్లో పంట వేశారు.
ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతాంగం
మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య సాగిన వేసవి సీజన్ రైతులకు పెద్దగా నిరాశ కలిగించలేదు. పంట దిగుబడులు మరో పదిరోజుల్లో పూర్తయి, మొత్తానికి మరో రెండు వారాల్లో ఈ సీజన్ పూర్తిగా ముగిసిపోతుంది. ఈ సీజన్ ముగియనుండటంతో దీని తర్వాత ప్రారంభమయ్యే ఖరీఫ్ సాగు కోసం అన్నదాతలు ఇప్పటికే సిద్ధమయ్యారు. రాబోయే ఖరీఫ్ సీజన్ పంటల కోసం నారు పోసుకోవడం, పొలాలను సిద్ధం చేసుకునే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.
ముగింపు దశలో మళ్లీ పుంజుకున్న మార్కెట్
మంగళవారం కిలో రూ. 26 గా నమోదు
ఎండల తీవ్రతకు చివర్లో తగ్గిన నాణ్యత
అయినా మార్కెట్‌లో
సరుకు కొరతతో పెరిగిన ధరలు


