గోధుమ.. సగం మందికే సుమా ! | - | Sakshi
Sakshi News home page

గోధుమ.. సగం మందికే సుమా !

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

అప్పులు చేసి డీడీలు చెల్లించినా

సగం మందికే గోధుమ పిండి !

గౌడౌన్‌లో స్టాక్‌ లేదంటున్న

సివిల్‌ సప్లయ్‌ అధికారులు

పెద్దతిప్పసముద్రం: రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలకు నెల నెలా ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్‌ సరుకులే ఆసరా. ఆ రేషన్‌ సరుకుల్లోనూ చంద్రబాబు సర్కార్‌ కోతపెడుతోంది. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయం, రేషన్‌ దుకాణాల్లో ప్రస్థుతం పొందుతున్న సరుకులతో పాటు అదనంగా రాగులు, సజ్జలు, కంది పప్పు పంపిణీ చేస్తామని చెప్పి ఇప్పుడేమో ఇచ్చే సరుకుల్లోనే కోత విధిస్తోంది. కేవలం బియ్యం, చక్కెరతో సరిపెడుతోంది. ఇక గోధుమ పిండి విషయానికొస్తే ఈ కోటాలో కొంత మందికి పరిమితం కాగా పలు చౌక దుకాణాలకైతే స్టాకే రాకపోవడం శోచనీయం.

డీలర్లకు తలనొప్పిగా గోధుమ పిండి పంపిణీ

చౌక దుకాణాలకు బియ్యం, చక్కెరతో పాటు గోధుమ పిండి అలాట్‌మెంట్‌కు కూడా డీడీలు చెల్లించాలని సివిల్‌ సప్లయ్‌ అధికారులు చౌక దుకాణ డీలర్లపై ఒత్తిడి తెచ్చారు. దీంతో డీలర్లు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి డీడీలు చెల్లించారు. సగం చౌక దుకాణాలకు మాత్రమే అది కూడా పూర్తి స్థాయిలో కాకుండా అరకొరగా పిండిని అలాట్‌ చేశారు. దీంతో వీటిని పంపిణీ చేసేందుకు డీలర్లకు తలనొప్పిగా మారుతోంది. వచ్చిన అరకొర పిండిని ఎవరికి ఇవ్వాలోనని ఆందోళన చెందుతున్నారు. మరి కొన్ని చోట్ల గోధుమ పిండి ఒకరికి ఇచ్చి తమకు ఎందుకు ఇవ్వలేదంటూ కార్డుదారులు నిలదీస్తుండటంతో డీలర్లకు చీవా ట్లు తప్పడం లేదు. ఇదిలా ఉండగా యుద్దం నేపథ్యంలో వంట గ్యాస్‌ ధరల పెంపుతో ప్రభుత్వం ప్రతి కార్డుదారుడికి కిరోసిన్‌ అందజేస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు ఆచరణకు నోచుకోలేదు.

జిల్లాలో 992 చౌక దుకాణాలు

అన్నమయ్య జిల్లా పరిధిలోని 25 మండలాల్లో మొత్తం 992 చౌక దుకాణాలు ఉండగా జిల్లా వ్యాప్తంగా 4,27,784 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో 12,86,918 మంది సభ్యులుగా ఉన్నారు.

గౌడౌన్‌లో స్టాక్‌ లేదు

చౌక దుకాణా డీలర్లే గోదుమ పిండికి కూడా డీడీలు తీశారు. గౌడౌన్‌లో స్టాక్‌ లేనందున అన్ని చౌక దుకాణాలకు పిండిని అలాట్‌ చేయలేదు. వచ్చే నెల అందరికీ ఇస్తాం. నా పరిధిలోని పీటీఎం, ములకలచెరువు, బి.కొత్తకోట మండలాల్లో 105 చౌక దుకాణాలకు గాను రేషన్‌ కార్డుల సంఖ్య ఆధారంగా 40 టన్నుల గోదుమ పిండి అవసరం కాగా 20 టన్నుల పిండి మాత్రమే అలాట్‌ అయింది. – సుబ్బయ్య,

సివిల్‌ సప్లై డిప్యూటీ తహశీల్దార్‌. బి.కొత్తకోట.

Advertisement
 
Advertisement
Advertisement