● రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీకి
మదనపల్లె: కోటలు దాటే సీఎం చంద్రబాబు మాట లు నీటి పథకాల దగ్గరికొచ్చే సరికి నీటి’మూటలుగానే మిగిలిపోతున్నాయి. జిల్లా రైతులకు సాగునీటి వసతి కల్పించి ఆయకట్టు భూములను సాగులోకి తీసుకురావడమేకాక, తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకాలను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. ఇవేకాక గత టీడీపీ పాలనలో ప్రతిపాదించిన పథకాలకూ మొండిచేయే చూపిస్తోంది. ముఖ్యంగా హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశలో చేపట్టాల్సిన 10 పథకాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కి స్తోంది. ఈ పథకాలు కార్యరూపం దాల్చితే ప్రాజెక్టు నుంచి 7.745 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఏర్పడి..తద్వారా 41,792 ఎకరాల ఆయకట్టు భూమి సాగులోకి వస్తుంది.
వైఎస్ జగన్ హయాంలో
నిమ్మనపల్లె మండలంలోని బాహుదా ప్రాజెక్టుకు పుంగనూరు ఉపకాలువ (పీబీసీ) నుంచి కృష్ణా జలాలను తరలించే పథకంతో పాటు రామసముద్రం ఉపకాలువ, రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీలకు ఆమోదం తెలిపి నిధులు ఇచ్చారు. పెద్దతిప్పసముద్రం మండలంలోని రంగసముద్రం చెరువుకు పీబీసీ నుంచి నీటి తరలింపుకు ఆమోదం తెలిపారు. అలాగే చిత్తూరుజిల్లాలో 106 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు కృష్ణా జలాల తరలింపుకు అను మతి ఇచ్చారు. గుర్రంకొండ మండలంలో రెడ్డెమ్మకోన రిజర్వాయర్‌కు సంబంధించిన చర్యలను తీసుకున్నారు. వీటిలో బాహుదా ప్రాజెక్టుకు నీటి తరలించే పథకం ముఖ్యమైంది. పీబీసీ నుంచి కృష్ణా జలాలను తరలించి ప్రాజెక్టును నింపితే ఆయకట్టు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. దీనికోసం రైతులు ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టడం లేదు.
రామసముద్రం కాలువ కోసం..
హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశలో భాగంగా రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ, రామసముద్రం ఉపకాలువను నిర్మించి కృష్ణా జలాలు అందించే పథకానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆమోదం తెలిపి సర్వే కోసం రూ.1.63కోట్లు మంజూరు చేసింది. మదనపల్లె నియోజకవర్గం మీదుగా సాగే పుంగనూరు ఉపకాలువపై సుగాలిమిట్ట వద్ద 183.3 కిలోమీటర్ వద్ద నుంచి ఉపకాలువ మొదలై 750 మీటర్ల దూరంలో ఒక ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి రామసముద్రం వరకు 28 కిలోమీటర్ల ఉపకాలువ తవ్వేలా ప్రణాళిక రచించింది. దీనివల్ల 60 చెరువులకు సాగునీరు, 84వేల మంది జనాభాకు తాగునీరు అందించాలని లక్ష్యం. రామసముద్రం సమీపంలో ఒక రిజర్వాయర్‌ను నిర్మించాలని ప్రతిపాదన. ఈ కాలువ సర్వే, సమగ్ర నివేదిక రూపొందించడం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇప్పుడు ఈ పథకాన్ని కూటమి పాలకులు విస్మరించారు.
కేవిపల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్ నుంచి ప్రారంభమయ్యే నీవా ఉపకాలువ ప్రారంభమై పులిచెర్ల మండలం కమ్మపల్లె మీదుగా సాగుతుంది. కమ్మపల్లె వద్ద 54.350 కిలోమీటర్ నుంచి రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్ల మట్టికాలువను తవ్వించి రైతులకు సాగునీరు, రొంపిచర్ల, చిన్నగొట్టిగల్లు, పులిచర్ల మండలాల్లోని 25వేల మంది జనాభాకు తాగునీటిని అందించాలన్నది నిర్ణయించారు. ఈ పనులు చేపట్టడం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం సమగ్ర సర్వే, నివేదిక కోసం రూ.59.22 లక్షలను మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం రాకతో దీని ఊసేలేకుండా పోయింది. జిల్లా అభివృద్ధే లక్ష్యమంటూ.. ఇక్కడి రైతులకు అండగా ఉంటానంటూ నిత్యం ఊదరగొట్టే సీఎం చంద్రబాబు ఆచరణకొచ్చేసరికి రిక్తహస్తం చూపిస్తున్నారు. బాబు మాటలు ‘నీటి’ మూటలేనని జిల్లా ప్రజ లు మండిపడుతున్నారు. ఇప్పటికై నా నీటి పథకాలకు నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
నీటి పథకాలను విస్మరించిన కూటమి ప్రభుత్వం
కార్యరూపం దాల్చితే అదనంగా 7.745 టీఎంసీల
కృష్ణా జలాల వినియోగం
సాగులోకి 41,792 ఎకరాల ఆయకట్టు
● రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీకి
● రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీకి


