అక్క కల నెరవేర్చిన తమ్ముడు
పెద్దతిప్పసముద్రం : అన్నమయ్య జిల్లా జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం రాపూరివాండ్లపల్లి పంచాయతీ కొత్తపల్లికి చెందిన యాదసంద్రం సురేష్ గ్రూప్ 2 ఫలితాల్లో విజయం సాధించాడు. గ్రామ సచివాలయ కార్యదర్శిగా పని చేస్తున్న ఆయన తన సోదరి మాధవి సహకారం, ప్రోత్సాహంతో గ్రూప్ 2 పరీక్షలు రాసి డిప్యూటి తహశీల్దార్‌గా ఎంపికయ్యాడు. కాగా అంతకుముందు తిరుపతి సమీపంలోని గాజులమండ్యం వద్ద ఉన్న మల్లాడి డ్రగ్స్ ఫార్మాసిటికల్స్‌లో కెమికల్ ఇంజనీర్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మిషన్ బ్లాస్ట్ కావడంతో సురేష్ కుడిచేయి దెబ్బతిని తీవ్రంగా గాయపడ్డాడు. కొడుకు గాయాలను చూసి చలించిపోయిన తండ్రి సిద్దప్ప తనకున్న ఎకరా పొలాన్ని అమ్మి కొడుకుకు వైద్య పరీక్షలు చేయించి గాయాలను మాన్పించాడు. కాగా 2020లో తన సోదరి మాధవి భర్త నాగరాజు, 2022లో తండ్రి సిద్దప్ప మృతి చెందారు. ఈ క్రమంలో సోదరి మాధవి తమ్ముడిని చిన్న ఉద్యోగం కాకుండా ఉన్నత స్థాయిలో చూడాలనుకుంది. దీంతో ఆమె మదనపల్లిలోని ఓ హోటల్‌లో పని చేస్తూ సోదరుడు సురేష్ ఉన్నత చదువులకు అన్ని విధాలా ప్రోత్సహించింది. సురేష్ కూడా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి సెలవు పెట్టి గ్రూప్ 2కు ప్రిపేరై విజయం సాధించాడు. తాను ఈ విజయం సాధించడానికి తన సోదరి మాధవి కారణమని సురేష్ కంటతడితో చెప్పారు.
అక్క కల నెరవేర్చిన తమ్ముడు


