ఏపీపీఎస్‌సీ గ్రూప్–2 ఫలితాల విడుదల రాణించిన జిల్లా యువ
పేదరికం వెక్కిరిస్తున్నా..
కష్టాలు ఎక్కిళ్లు తెప్పిస్తున్నా
వారు వెనకడుగు వేయలేదు..
‘పుస్తకాన్నే’ సమస్తంగా మార్చుకుని..
అందులోని పాఠాన్నే ఇష్టంగా మలుచుకుని
రాత్రింబవళ్లు మనసు పెట్టి చదివారు...
సాధనే సోపానంగా చేసుకుని..
విజయమే లక్ష్యంగా పైకెదిగారు.
సంకల్ప బలం ఉండాలేగానీ సాధించలేనిది
ఏదీ లేదని నిరూపించిన విజేతలు వారు..
బుధవారం విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో
‘కొలువులు’ సాధించి స్ఫూర్తిగా నిలిచారు.
కడప సెవెన్‌రోడ్స్/కడప ఎడ్యుకేషన్: పట్టుదల, ప్రణాళికబద్ధమెన కృషి ఉంటే ఎంతటి ఉన్నత లక్ష్యాన్నైనా సాధించగలమని జిల్లా యువత మరోమారు రుజువు చేసింది. బుధవారం విడుదలైన ఏపీపీఎస్‌సీ గ్రూప్–2 ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించారు. పలువురు ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో చాలామంది సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు, ఇతర చిన్నచిన్న ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న వారిలో మహిళలు గణనీయ సంఖ్యలో ఉండడం విశేషం. జిల్లాలోని కడప, ఖాజీపేట, జమ్మలమడుగు, పెండ్లిమర్రి, ఒంటిమిట్ట తదితర ప్రాంతాలకు చెందిన వారు ఈ పరీక్షలో తమ ప్రతిభ చాటారు.


