ప్రాజెక్టులపై కనికరిస్తారా !
మదనపల్లె : సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తికి చంద్రబాబు సర్కార్ సహకరిస్తుందా, నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చూపుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఉమ్మడి అనంతపురం, వైఎస్సార్‌కడప, చిత్తూరుజిల్లాలో కీలకమైన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, ఇతర ప్రాజెక్టుల పనులౖపై, దానికవసరమయ్యే నిధులు, పెండింగ్ బిల్లులు, బకాయిలు తదితర వాటిని లెక్కిస్తూ 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు ఎంతకావాలో కోరుతూ ప్రాజెక్టుల ఉన్నతస్థాయి అధికారులు ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. ఈ నివేదికలపై గురువారం అమరావతిలో ఆర్థికశాఖ కార్యదర్శులు, జలవనరులశాఖ ఈఎన్‌సీ, సాగునీటి ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆర్థిక అంశాలపై చర్చించి ఏ ప్రాజెక్టుకు ఎంత నిధులు ప్రతిపాదించారు, ఎంత నిధులు అవసరం తదితర విషయాలు బడ్జెట్ కేటాయింపు ప్రకటనలో తేలనున్నాయి.
హెచ్‌ఎస్‌ఎస్‌కు రూ.2,500 కోట్లు
హంద్రీ–నీవా మొదటి, రెండోదశ పనులకు రూ.2,500 కోట్లు కావాలని ప్రతిపాదించారు. ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధానకాలువ వెడల్పు, లైనింగ్ పనులకు సంబంధించి ఇప్పటికే రూ.695 కోట్ల పనులు దాదాపుగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. దీనికి రూ.150 కోట్ల బిల్లులు, రెండోదశలో ఉమ్మడిచిత్తూరుజిల్లాలో పీబీసీ లైనింగ్ పనులకు రూ.130 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్‌అండ్‌ఆర్‌కు రూ.80 కోట్లు అవసరమని నిర్ణయించారు. ఇవికాక హంద్రీ–నీవా ఎత్తిపోతల పథకాలు వినియోగించినందుకు విద్యుత్ బకాయిలే రూ.1,800 కోట్లదాక ఉన్నట్టు అధికార వర్గాలే చెబుతున్నాయి. ఈ లెక్కన అధికారులు రూ.2,500 కోట్లు కావాలని ప్రతిపాదించినా ఆస్థాయిలో నిధులు కేటాయింపు అవసరమైతే ఉంది. మొదటిదశ పనుల పరిస్థితి ఎలా ఉన్నా, రెండో దశ ప్రాజెక్టు సాగే ఉమ్మడిచిత్తూరు, వైఎస్సార్‌కడప జిల్లాల్లో జరగాల్సిన ప్రధానకాలువ, నీవా ఉపకాలువ పనులకు రూ.925 కోట్లు కావాలని ఇప్పటికే ప్రతిపాదించారు. ఇవికాక ఉమ్మడిచిత్తూరుజిల్లాలో అసంపూర్తిగా మిగిలిన ఉపకాలువలు, డిస్ట్రీబ్యూటరీ పనులకు ప్రతిపాదనలు ఇవ్వలేదు. వీటిని కలిపితే ప్రాజెక్టు పనుల విలువ పెరిగిపోతుంది. మొత్తం ప్రాజెక్టులో సాగుతున్న పనుల పూర్తికి రూ.5వేల కోట్లదాక అవసరమని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదిన నిధులు కేటాయింపు జరక్కపోతే పనులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మొక్కుబడి నిధులు ఇస్తే బకాయిలు, వేతనాలు, ఖర్చులకే సరిపోతాయి. నిధుల కేటాయింపులపైనే ప్రాజెక్టు పనులు ఆధారపడి ఉన్నాయి.
గాలేరు–నగరికి రూ.2,460 కోట్లు
గాలేరు–నగరి ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు సర్కార్ ప్రస్తుత బడ్జెట్‌లో రూ.307 కోట్లు కేటాయించగా అంతటితోనే పనులు ముగించారు. దీనికి బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్‌కడప, చిత్తూరుజిల్లాలకు కీలకమైన ఈ ప్రాజెక్టు పనులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వచ్చే బడ్జెట్‌లో రూ.2,460 కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ నిధులతో ప్రాజెక్టు పనులు చేయించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వచ్చే జూన్‌లో చిత్తూరుకు కృష్ణాజలాలను ఈ ప్రాజెక్టు ద్వారానే తరలిస్తామని నగరిలో జరిగిన సభలో చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుత బడ్జెట్ తరహాలో నిధులు కేటాయింపు జరిగితే ప్రాజెక్టు పనులు అడుగుకూడా ముందుకు పడే పరిస్థితులు ఉండవు. హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిని నెరవేర్చాలంటే ఇబ్బడిముబ్బడిగా నిధులు కేటాయించాల్సిందే. దీనికితోడు గండికోట రిజర్వాయర్ నుంచి హంద్రీ–నీవా ప్రాజెక్టుకు కృష్ణాజలాల తరలింపు పనులు పెండింగ్‌లో పెట్టారు. వచ్చే బడ్జెట్ కేటాయింపుల్లో మొక్కుబడి నిధులిస్తే ప్రాజెక్టును అటకెక్కించినట్టే. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి హంద్రీ–నీవా ప్రాజెక్టు అనుసంధాన పనులు ఆపివేయించిన ఫలిత ప్రభావం కనిపిస్తోంది. కాగా తెలుగుగంగ ప్రాజెక్టు నిర్వహణ పనుల కోసం రూ.146 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు.
అనుసంధానం ఏమౌతుందో
ఉమ్మడి వైఎస్సార్‌కడప, చిత్తూరుజిల్లా కరువురైతుల తలరాతలను మార్చే గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టుల అనుసంధానం పనులపై బడ్జెట్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది.
వచ్చే బడ్జెట్‌లో కేటాయింపుల కోసం ఆర్థికశాఖకు నివేదన
నేడు ఆర్థికశాఖ కార్యదర్శులు,
ఈఎన్‌సీ, సీఈల సమావేశంలో
కేటాయింపులపై చర్చలు
ప్రాజెక్టుల పూర్తి కోసం
ఆశగా ఎదురుచూస్తున్న రైతులు


