● పట్టిసీమ వల్లే సీమకు నీరట!
సీఎం పర్యటనతో ఒరిగిందేంటీ?
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కడప జిల్లాకు కొత్తగా ఒక్క హామీ ఇవ్వలేదు... కమలాపురం నియోజకవర్గానికి ప్రాణప్రదమైన సర్వారాయసాగర్ ప్రాజెక్టు గురించి ఊసే లేదు.. నిధులు గుమ్మరించిందీ లేదు.. అంతెందుకు ఒక్క నిజమూ చెప్పలేదు.. ఎప్పటిలానే నిజాలను నిలువునా పాతరేసి.. పర్యటన ఆసాంతం అబద్ధాలే వల్లె వేశారు.. ‘అంతా నేనే...’అంటూ గొప్పలు చెప్పడంలోనే మునిగిపోయారు. మూడు ముక్కల్లో చెప్పాలంటే సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన తీరిది. పీఎం కిసాన్–అన్నదాతా సుఖీభవ నిధుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పెండ్లిమర్రిలో పర్యటించారు.
మరోసారి నిరాశే...
సాధారణంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే జిల్లావాసులు ఆశగా ఎదురుచూస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏదైనా కొత్త హామీ ఇస్తారేమో... గతంలో ఇచ్చిన వాటికి నిధుల వరద పారిస్తారేమోనని ఆసక్తి కనబరుస్తారు. జిల్లా ప్రజలకు మరోసారి నిరాశే ఎదురైంది. సీఎం చంద్రబాబు నోటివెంట అభివృద్ధి మాటే లేకుండా పోయింది. ఎప్పటిలానే కడపపై చిన్నచూపే చూశారు. పైగా జిల్లాకొచ్చిన ప్రతీసారి హార్టికల్చర్ హబ్ అంటూ చెప్పే చంద్రబాబు.. తాజా పర్యటనలో అగ్రిటెక్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అంతేనా ఏడాదిన్నర్రగా కమలాపురం నియోజకవర్గంలోని సర్వారాయసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌కు దిక్కులేదు కానీ, గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం చేయనున్నట్లు బీరాలు పలికారు. వెరసి సీఎం చంద్రబాబు పర్యటన వల్ల జిల్లాకు ఇసుమంత ప్రయోజనం కూడా దక్కలేదు.
‘రచ్చబండ’అర్థమే మార్చారు..
పెండ్లిమర్రి మండలంలోని చిన్నదాసరిపల్లె వద్ద రైతులతో సీఎం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మొత్తం సెల్ఫ్ డబ్బాకు పరిమితమయ్యారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే అవకాశమే ఇవ్వకుండా రచ్చబండ కాన్సెప్ట్‌కు అర్థమే లేకుండా చేశారని పలువురు వాపోయారు. డబుల్ ఇంజన్ సర్కారని చెప్పుకునేందుకు ఘనంగా ఉంది. ఆచరణలో అదేస్థాయిలో వేగంగా రాష్ట్రంలో అభివృద్ధి ఏమాత్రం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. దివంగత ఎన్‌టీఆర్ సర్కార్‌లో జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ రూపకల్పన చేసినప్పటికీ వాటిని ఆచరణలోకి తెచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇది జగమెరిగిన సత్యం. ఆ విషయాన్ని కూడా మభ్యపెట్టడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నించారు. జీఎన్‌ఎస్‌ఎస్–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ టీడీపీ వల్లే సాధ్యమైందని చెప్పుకరావడంపై రాజకీయ పరిశీలకులు విమర్శిస్తున్నారు. అంతెందుకు జిల్లాకు ప్రాణపదమైన గండికోట ప్రాజెక్టును రద్దు చేయాలని ప్రతిపాదించి, ప్రజాందోళనకు వెనక్కి తగ్గి నాన్ ప్రయారిటీ జాబితాలోకి చేర్చిన ఘనత కూడా అప్పటి చంద్రబాబు సర్కార్‌దేని జిల్లాకు చెందిన సాగునీటి నిపుణులు విమర్శనాస్త్రాలు సంధించారు.
సీఎం చంద్రబాబు తాజా పర్యటనతో ఒరిగిందేమీ లేదని రాజకీయవేత్తలు విమర్శిస్తున్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభు త్వ పథకాలను బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు అందిస్తే... చంద్రబాబేమో పింఛన్ల పంపిణీ మొదలు ప్రతి కార్యక్రమాన్ని ప్రచారం కోసమే వాడుకుంటున్నారని విశ్లేషకులు పోలుస్తున్నారు. తాజాగా పీఎం కిసాన్–అన్నదాత సుఖీ భవ పథకం కూడా ప్రచారానికే వాడుకున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం పర్యటన చేస్తే కనీసం ఆ ప్రాంతం ప్రయోజనం కోసం ఏదోక అభివృద్ధి చేపట్టేవారు. అవేవి లేకుండా సెల్ఫ్‌డబ్బాకే పరిమితం కావడంపై ప్రజాస్వామ్వవాదులు తప్పుబడుతున్నారు.
జిల్లాకు కొత్తగా ఒక్క హామీ ఇవ్వని సీఎం
సర్వరాయసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఊసేలేదు..
పైగా నదుల అనుసంధానమంటూ బీరాలు పలికిన వైనం
ఆశ్చర్యం వక్తం చేస్తున్న జిల్లా రైతులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1995– 2004 వరకూ విజన్–2020 అంటూ ఊదరగొట్టారు. ఆపై 2014–19లో ‘పాడిందే పాడరా పాసిపళ్ల దాసరి’అన్నట్లుగా పట్టిసీమ–హార్టికల్చర్ హబ్ అంటూ ఐదేళ్లు ఒకే పాట పాడారు. పైగా రాజంపేటను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని జిల్లాకొచ్చిన ప్రతిసారీ ప్రకటించారు. అవన్నీ గాలిలో కలిసిపోయాయి. తాజాగా రైతు ల కోసం అగ్రిటెక్ ముందుకొచ్చిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పట్టిసీమ వల్లే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయని సీఎం స్థాయిలో ప్రకటించడాన్ని సాగునీటి నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పట్టిసీమ లేని రోజు కూడా సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్లు నిల్వ చేసిన వైనాన్ని వివరిస్తున్నారు.
3టీఎంసీలకు మాత్రమే పరిమితమైన సర్వరాయసాగర్ ప్రాజెక్టు పరిధిలో పిల్లకాలువలు ఏర్పాటు చేసి సాగునీరు అందించలేని దుస్థితిలో ఉండి కూడా, గోదావరి–కృష్ణా నదులు అనుసంధానం అంటూ బీరాలు పలకడంపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల ఉన్నతికి కొత్తగా ఐదు సూత్రాలు కనిపెట్టినట్లుగా చంద్రబాబు చెప్పుకరావడం మరో విడ్డూరంగా ఉందని రైతుల సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, వ్యవసాయాధారిత పరిశ్రమలు, ప్రభుత్వ ప్రోత్సాహం ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వ్యవసాయశాఖ రైతులకు తెలియజేస్తోంది. కానీ, తాను మాత్రమే రైతుల కోసం తపన పడుతున్నట్లుగా కలరింగ్ ఇవ్వడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరెవ్వరూ సాటి లేరంటూ విశ్లేషకులు తూర్పారబట్టారు.
● పట్టిసీమ వల్లే సీమకు నీరట!


