ఒక్క రైతూ పెరగలేదు!
● జిల్లాలో అన్నదాత సుఖీభవకు మారని సంఖ్య
మదనపల్లె: జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకంపై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే మిగిలింది. ఈ ఏడాది ఆగస్టులో తొలివిడత పథకం నిధులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాలకు జమ చేశాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చివరి ఏడాది జిల్లాలో 2,03,374 మంది రైతులకు వైఎస్సార్ రైతుభరోసా పథకం వర్తింపజేశారు. ఈలెక్కన రైతుల సంఖ్య పెరగాలి కాని తగ్గడానికి ఆస్కారం లేదు. అయితే ప్రభుత్వం కొర్రీలతో పథకంలో కోతలు వేసింది. దీంతో రైతుల సంఖ్య తగ్గి 14,966 మందికి మొండిచేయే మిగిలింది. తొలివిడతలో కొన్ని సాంకేతిక సమస్యలతో రైతుల వివరాల నమోదులో జాప్యం కారణంగా రెండో విడతలో సంఖ్య పెరుగుతుందని ఆశించారు. ఆయితే ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. బుధవారం అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల జమ సందర్భంగా లబ్ధిపొందిన రైతులసంఖ్య పరిశీలిస్తే ఈ మేరకు స్పష్టమైంది. తొలి విడతలో ఎంతమందికి వర్తింపజేశారో, రెండో విడతలోనూ అంతే మందికి ఇచ్చారు. ఒక్క రైతు పెరగలేదు, ఒక్క రైతు తగ్గనూ లేదు.
మదనపల్లె నియోజకవర్గానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధుల విడుదలను టీడీపీ నేతలు సంబరంగా జరుపుకోవాలని ప్రయత్నించారు. అయితే రైతులు లేకుండానే సభ నిర్వహించుకోవాల్సి వచ్చింది. ఎమ్మెల్యే, ఇతర టీడీపీ నేతలు హజరైనప్పటికి సభలో రైతులు కనిపించలేదు. మహిళా సంఘాలు, స్థానిక టీడీపీ నేతలే హజరయ్యారు. వేదికపైనే 20మందికిపైగా ఆశీనులు కాగా వేదిక కింద రైతులు లేక వెలవెలబోయింది.


