కృష్ణమ్మా.. ఆగవమ్మా | - | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మా.. ఆగవమ్మా

Nov 20 2025 7:16 AM | Updated on Nov 20 2025 7:16 AM

కృష్ణమ్మా.. ఆగవమ్మా

కృష్ణమ్మా.. ఆగవమ్మా

జగన్‌ పాలనలో న్యాయం

నీళ్లు ఆగిపోతే..

మదనపల్లె: ఉరుకు పరుగుల కృష్ణమ్మా..తంబళ్లపల్లె వద్ద ఆగమ్మా అని కరువు రైతులు వేడుకుంటున్నా కుప్పం వైపే పరుగుపెడుతోంది. పాలకులను ప్రసన్నం చేసుకోండి ఆగతానంటోంది కృష్ణమ్మ. ఎప్పటికి ఆగుతుందో..మా చెరువులు ఎప్పుడు కళకళలాడుతాయో అంటూ కరువు రైతులు దిక్కులు చూస్తున్నారు. ఆగస్టు 17న సత్యసాయిజిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లె రిజర్వాయర్‌ నుంచి కృష్ణా జలాలను విడుదల చేయగా అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు ఉపకాలువ నుంచి చిత్తూరుజిల్లా పుంగనూరుకు, అక్కడి నుంచి కుప్పం ఉపకాలువలోకి ప్రవహిస్తున్నాయి. ఈరోజుకు సరిగ్గా 90 రోజులుగా కృష్ణా జలాలన్నీ చంద్రబాబు నియోజకవర్గం కుప్పానికే తరలిస్తున్నారు.

70 చెరువులు నింపేశారు

90 రోజులుగా ప్రవహిస్తున్న నీటితో కుప్పం నియోజకవర్గంలోని 70కిపైగా చెరువులను నింపేశారు. ఇందులో పలమనేరు నియోజకవర్గానికి చెందిన కొన్ని చెరువులు ఉన్నాయి. కుప్పం ఉపకాలువకు సంబంధించి 114 చెరువులకు నీటిని అందించాలని డీపీఆర్‌లో పెట్టారు. అందుకు తగ్గట్టుగా నీటిని తరలించుకుని చెరువులను నింపుకున్నప్పటికీ అభ్యంతరం ఉండబోదు. పైగా ఇంకా నింపాల్సిన చెరువులు ఉన్నాయి. వాటిని ప్రాధాన్యత క్రమంలో నింపుకోవచ్చు. ఇందులో 50 శాతం దాకా నిండిన చెరువులు 20 వరకు ఉన్నాయి. ఇవి నిండిపోయాక మిగిలిన చెరువులను నింపేదాక అధికారులు మరో నియోజకవర్గానికి నీటిని మళ్లించే పరిస్థితులు కనిపించడం లేదు. దాంతో అధికారులు మాత్రం చంద్రబాబు నియోజకవర్గం కాబట్టి ఎనలేని ప్రాధాన్యత చూపుతున్నారు.

అదనంగా 47 చెరువులు

కేబీసీ డీపిఆర్‌ ప్రకారం చెరువులు నింపుకోకుండా ఎగువన ఉన్న తంబళ్లపల్లె నియోజకవర్గ రైతుల నోళ్లుకొట్టి కుప్పం నియోజకవర్గంలో అదనంగా మరో 47 చెరువులకు నీళ్లు తరలించాలని హంద్రీ–నీవా ప్రాజెక్టు అధికారులు ప్రణాళిక అమలు చేస్తున్నారు. 47 చెరువుల్లో కుప్పంలో 37, పలమనేరులో 10 చెరువులను గుర్తించారు. కేబీసీలో నిర్ణయించిన చెరువులన్ని నిండాక కొత్త ప్రణాళిక ప్రకారం 47 చెరువులను నింపేందుకు అధికారులు నిర్ణయం తీసుకుని సిద్దమయ్యారు.

తంబళ్లపల్లెను ఎండబెగట్టి

కృష్ణాజలాలు తంబళ్లపల్లె నియోజకవర్గం దాటుకుని మదనపల్లె, పుంగనూరు, పలమనేరు మీదుగా కుప్పానికి వెళ్లాలి. మొదట ఉన్న తంబళ్లపల్లె నియోజకవర్గం కరువు ప్రాంతం. ఇక్కడి చెరువులను నింపాలని రైతులు విన్నవిస్తున్నారు. చెరువులు నిండితే ఆయకట్టు సాగులోకి రావడమే కాకుండా వ్యవసాయ బోర్లలో నీటిమట్టం పెరుగుతుంది. నియోజకవర్గంలో 90కిపైగా చెరువులకు కృష్ణా జలాలను తరలించాల్సి ఉంది. ఇటీవల కురిసిన వర్గాలకు చెరువులు నిండి ప్రవహిస్తున్నాయి. ఇవికాకుండా చుక్కనీరులేని చెరువులకు నీటిని మళ్లించి నింపాలని రైతాంగం కోరుతోంది. తంబళ్లపల్లెకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణా జలాలతో నిండిన

కుప్పంలోని పరమసముద్రం చెరువు

సీఎం జగన్‌ ప్రభుత్వంలో కృష్ణా జలాల తరలింపులో న్యాయం జరిగింది. 2019 నవంబర్‌ 22 నుంచి మార్చి వరకు 1.34 టీఎంసీలు, 2020 నవంబర్‌ 12 నుంచి 2021 మే15 వరకు 2.5218 టీఎంసీలను ప్రస్తుత అన్నమయ్య, చిత్తూరుజిల్లాలకు చెందిన 91 చెరువులకు నీటిని అందించారు. చిత్తూరుజిల్లా వి.కోట మండలం వరకు కృష్ణా జలాలు పారించారు. మదనపల్లె, పుంగనూరు పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే చిప్పిలి, గుంటివారిపల్లె, పుంగమ్మ సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులను నింపి నీటి కష్టాలను తీర్చారు. పలమనేరు నియోజకవర్గం శంకర్రాయలపేట చెరువుకు నీటిని మళ్లించి నింపారు. 2023 అక్టోబర్‌ 9 నుంచి 2024 మార్చి 5 వరకు 2.6 టీఎంసీల కృష్ణా జలాలను ఇక్కడికి తరలించారు. కుప్పం నియోజకవర్గంలోని మద్దికుంట, వెరశిచెరువు, చిట్టివానికుంటలకు నింపగా తర్వాత శ్రీశైలం నుంచి నీటి తరలింపు ఆగిపోయింది.

తంబళ్లపల్లె నియోజకవర్గ చెరువులను నింపిన తర్వాత కుప్పం నియోజకవర్గానికి అదనపు చెరువులను నింపుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కృష్ణా జలాల తరలింపు ఆగిపోతే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. కుప్పానికి మాత్రమే ప్రాధాన్యత నీటిని తరలించుకోవడం తగదని అంటున్నారు. మా నియోజకవర్గం మీదుగా నీళ్లు తరలించుకుంటూ మాకు లేకుండా చేస్తారా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement