అన్నదాత సుఖీభవ సభ రసాభాస
కురబలకోట: తంబళ్లపల్లె నియోజక వర్గ స్థాయిలో బుధవారం అంగళ్లు భారత్ కల్యాణ మండపంలో జరిగిన అన్నదాత సుఖీభవ సభలో టీడీపీ నేతల రసాభాసతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఎదుటే అరుపులతో సభ దద్దరిల్లింది. మంత్రి వారిస్తున్నా ఒక్కరూ లెక్కచేయలేదు. చివరకు అసహనంతో వెళ్లిపోతున్నా కారుకు అడ్డుపడి నిరసన వ్యక్తం చేశారు.
అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల జమకు సంబంధించిన అధికారికంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జనార్దనరెడ్డి హజరయ్యారు. సభ ప్రారంభానికి ముందు మదనపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు సీడ్ మల్లికార్జుననాయుడును ఆహ్వానించి వేదికపై కూర్చోబెట్టారు. దీంతో అలజడి మొదలైంది. మల్లికార్జుననాయుడికి ఏ ప్రోటోకాల్ ఉందని వేదికపై కూర్చోబెట్టారని మంత్రిని నిలదీశారు. తక్షణమే కిందకు పంపాలని డిమాండ్ చేస్తూ అరుపులతో అలజడి సృష్టించారు. మరోవైపు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన్ను కిందకు దింపాలి..లేకపోతే మేమంతా వేదికపైకి వస్తామంటూ భీష్మించుకున్నారు. ఈ విషయమై తర్వాత మాట్లాడతానని ఓపిక వహించాలని మంత్రి నచ్చజెప్పే ప్రయత్నం ఎంతచేసినా పట్టువీడలేదు. ఆయనను కిందకు దించితేనే చెప్పింది వింటామంటూ పట్టుబట్టారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో విధిలేని పరిస్థితిలో మంత్రి జనార్దనరెడ్డి వేదిక దిగి వెళ్లాలని మల్లికార్జుననాయుడుని సూచించడంతో ఆయన వేదిక దిగి కిందకు రావడంతో టీడీపీ నాయకులు శాంతించారు. తర్వాత ప్రధానమంత్రి మోదీ కార్యక్రమాన్ని టీవీలో చూస్తుండగా మల్లికార్జున నాయుడు స్పృహ తప్పి పడిపోగా మదనపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించగా కోలుకుంటున్నారు.
● అన్నదాత సుఖీభవ కార్యక్రమం ముగిశాక మంత్రి జనార్దనరెడ్డి కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రయత్నించగా మళ్లీ అడ్డుతగిలారు. నియోజకవర్గానికి ఇన్‌చార్జి లేరు..మాకు దిక్కెవరంటూ నిరసన వ్యక్తం చేశారు. నియోజక వర్గంలో కార్యకర్తలు, నాయకుల పరిస్థితి తనకు తెలుసని, వచ్చేనెల మొదటి వారంలోపు పార్టీ ఇన్‌చార్జిని నియమిస్తామని మంత్రి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. మీవన్నీ మాటలు తప్ప చర్యలు ఎక్కడని నిలదీస్తూ అడుగడుగునా మంత్రి ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో అసహనానికి గురైన మంత్రి వేదిక దిగి వెళ్తుతుండగా టీడీపీ శ్రేణులు వెంటపడుతూ జై శంకర్ నినాదాలతో హోరెత్తించారు. అంతటితో ఆగక మంత్రి కారు ముందుకెళ్లి అడ్డుపడి నిరసన తెలిపారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి జనార్దనరెడ్డి సభలో ఈలలు..అరుపులు..కేకలు
తంబళ్లపల్లె టీడీపీలో భగ్గుమన్న విబేధాలు
అన్నదాత సుఖీభవ సభ రసాభాస


