ఖరీఫ్‌కు కష్టకాలం !
● దుక్కులు దున్ని విత్తనకాయల కోసం ఎదురుచూపు
● వేరుశనగ రైతుపై కక్షగట్టిన
కూటమి ప్రభుత్వం
● 55,066 క్వింటాళ్ల విత్తనకాయలు అడిగితే 36,034 క్వింటాళ్లకే మంజూరు
● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
అడిగినంత ఇచ్చిన వ్యవసాయశాఖ
● వర్షాభావంతో తగ్గిపోతున్న
పంటల సాగు విస్తీర్ణం
● దీంతో 2025 ఖరీఫ్ ప్రణాళికను
కుదించిన వ్యవసాయశాఖ
బి.కొత్తకోట : జిల్లాలో ఖరీఫ్ సాగుకు కష్ట కాలమొచ్చింది. ఏటా సాగు అంచనాలకు అనుగుణంగా రైతాంగానికి విత్తనకాయలను సరఫరా చేయాల్సిన కూటమి ప్రభుత్వం ప్రస్తుత ఖరీఫ్‌లో కోత విధించింది. ఇచ్చిందే తీసుకోండి అంటూ వేరుశనగ విత్తనకాయలను కేటాయించింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లా వ్యవసాయ ప్రణాళిక ప్రతిపాదనలో ఎంత పరిమాణంలో విత్తనకాయలపై ప్రతిపాదిస్తే అంతే పరిమాణంలో కేటాయింపులు చేశారు. ప్రస్తుతం ఈ పరిస్థితి తలకిందులైంది. భారీగా కోత విధించిన ప్రభుత్వం రైతులను ఇబ్బందుల్లోకి నెట్టింది. కాగా విత్తనకాయల పంపిణీ ప్రారంభం కాకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు.
19,032 క్వింటాళ్ల తగ్గింపు
ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలో 62,890 హెక్టార్లతో అన్ని పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో వేరుశనగ సాగు చేసే రైతాంగానికి 55,066 క్వింటాళ్ల విత్తనకాయలు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. అయితే ప్రభుత్వం అందులో కోత విధించి 36,034 క్వింటాళ్ల విత్తనకాయలు మాత్రమే మంజూరు చేస్తూ కేటాయించింది. ఈ కేటాయింపు విత్తనకాయల సరఫరాలోనూ తీవ్ర జాప్యం చేస్తోంది. ఇప్పటికే విత్తనం సిద్ధం చేసుకోవాల్సిన రైతులు విత్తనం కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు పంటల సాగుపై ఆశలు పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో వేరుశనగ రైతులకు అవసరమైన విత్తనకాయలను ప్రభుత్వం పంపిణీ చేసే పరిస్థితుల్లో లేకపోవడం రైతుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. దీనితో వ్యాపారుల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది.
జిల్లాకు ప్రభుత్వం కేటాయించిన విత్తనకాయల ను ఇంకా పంపిణీ ప్రారంభించలేదు. ప్రస్తుతానికి సరఫరా అయిన ఐదువేల క్వింటాళ్ల విత్తనకాయలను మ దనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల్లోని మండలాలకు తరలించారు. ఇవి ఏ మూలకు సరిపోవు.
గత ప్రభుత్వంలో అడిగినంత
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళిక ప్రతిపాదన మేరకు ఒక్క కింట్వా కూడా తగ్గకుండా కేటాయింపు జరిగేవి. 2022లో 59, 410 క్వింటాళ్లు, 2023లో 51,707 క్వింటాళ్లు, 2024లో 55,066 కింట్వాళ్లు కావాలని ప్రతిపాదించగా ఇంతే పరిమాణంలో కేటాయించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీనితో రైతులకు ఇబ్బందులు తప్పవు.
● కాగా జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయం తగ్గిపోతోంది. 2025లో 62,890 హెక్టార్లు సాగు లక్ష్యం కాగా 2,493 హెక్టార్లలో పంటల సాగు లక్ష్యం తగ్గించారు. 30 మండలాలు కలిగిన చిన్న జిల్లాలో ఈ స్థాయి విస్తీర్ణంలో పంటలు సాగు కావడం లేదంటే ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టే.
విత్తనం కోసం ఎదురుచూపు
ఖరీఫ్ సాగు కోసం రైతులు పొలాలను దుక్కులు దున్ని సిద్ధం చేశారు. విత్తనకాయలను రాయితీపై ప్రభుత్వం పంపిణీ ప్రారంభిస్తే విత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటికీ విత్తనకాయలను పూర్తిస్థాయిలో మండల కేంద్రాలకు, ఇక్కడినుంచి గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలకు తరలించి రైతులకు అందించాల్సి ఉంది. జూన్ మొదటి వారంలోకి వచ్చినా ఇంకా విత్తనకాయల జాడలేదు. దీనితో రైతులు దుక్కులు దున్ని దిక్కులు చూస్తున్నారు.


