గుంటూరు: వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేయడంతో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా బలోపేతం అయ్యేలా ముందుకు వెళ్లాలని పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసి హింసించారని చెప్పారు.
గుంటూరులో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటర్ లిస్టు పట్ల అప్రమత్తంగా ఉండాలి. మనకు అనుకూలమైన ఓట‍్లను తీసివేసే అవకాశం ఉంది. అందరూ అప్రమత్తంగా ఉండండి.
ప్రభుత్వం ఎన్ని దాడులు చేసి, ఎంత హింసించినా మన కార్యకర్తలు నాయకులు ఎక్కడా భయపడలేదు, వెనకడుగు వేయలేదు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ఎదురించి ధైర్యంగా నిలబడిన ప్రతి నాయకుడికి, పార్టీ కార్యకర్తకు అభినందనలు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్ ఇళ్లపై దాడి చేశారు. కూటమి నాయకుల దాడులకు బెదిరింపులకు భయపడే వారు ఎవరూ లేరు.
కూటమి నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎలా మోసం చేశారో ప్రజలకు వివరించాలి. గత ఏడాది రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం ఒక్క రైతును కూడా ఆదుకోలేదు. వైఎస్ జగనన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతుల్ని ఆదుకున్నాం.
రాజధాని అమరావతి నిర్మాణాన్ని 2028 కల్లా పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది. 2028 కల్లా రాజధాని పూర్తయితే ఇంకా అసెంబ్లీలో తీర్మానం ఎందుకు? రాజధాని తీర్మానం పేరుతో ప్రభుత్వం కొత్త డ్రామా ఆడింది. ఇదో రకమైన డైవర్షన్ పాలిటిక్స్. రాజధాని పేరుతో మొదట్లో 50 వేల ఎకరాలకు పైగా భూమిని తీసుకున్నారు.
రైతులకు తిరిగి ఇచ్చే ప్లాట్లను ఎక్కడ అభివృద్ధి చేశారు? అమరావతిలో రోడ్లు ఎక్కడ పూర్తి చేశారు? ఇవేమీ జరగకుండానే మరోసారి 50వేల ఎకరాలు రెండో దశలో తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అమరావతి అభివృద్ధికి 2 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. అంత ఖర్చు పెట్టే పరిస్థితి మన రాష్ట్రానికి ఉందా? అమరావతి పేరుతో టెండర్లు పిలిచి ఏటీఎంలా వాడుకున్నారు. అమరావతి పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు.. దానికోసమే అసెంబ్లీలో తీర్మానం’ అని చెప్పారు.


