వెంకయ్యనాయుడు.. స్ఫూర్తిదాయకం: విజయసాయిరెడ్డి

YSRCP Vijayasai Reddy Praises Venkaiah Naidu - Sakshi

రాజ్యసభ చైర్మన్‌కు వీడ్కోలు సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  

సాక్షి, న్యూఢిల్లీ:  ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు స్ఫూర్తిదాయకమని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. రాజ్యసభ అధ్యక్షస్థానంలో తెలుగువ్యక్తి కూర్చోవడం గురించి ఉభయసభల్లోని తెలుగు రాష్ట్రాల ఎంపీలు గర్వంగా చెప్పుకొంటారన్నారు. వెంకయ్యనాయుడు పదవీ విరమణ చేయనున్న సందర్భంగా సోమవారం రాజ్యసభలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. వెంకయ్యనాయుడు సొంత జిల్లా అయిన నెల్లూరుకు చెందిన వ్యక్తిని కావడం తన అదృష్టమన్నారు.

అనేక సభల్లో వెంకయ్యనాయుడు చేసిన ఉపన్యాసాలు తెలుగు రాష్ట్రాల ప్రజలనేగాక దేశవ్యాప్తంగా ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పారు. విద్యార్థి దశలో తాను ఎంతో ప్రభావితమయ్యాయని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్లుగా తెలుగు, ఇంగ్లిష్, హిందీ, తమిళం వంటి అనేక భాషల్లో వెంకయ్యనాయుడు పరిజ్ఞానం అపారమైనదని కొనియాడారు. రాజ్యసభను సమర్థంగా నడిపించారని, కొత్త, పాత అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరికీ మాట్లాడే అవకాశం కల్పించారని చెప్పారు.

2019 ఆగస్టు 5న ఆర్టికల్‌ 370పై జరిగిన చర్చను గుర్తుచేస్తూ.. ఉద్రిక్త వాతావరణంలో చర్చ జరుగుతున్నప్పటికీ ప్రాంతీయ పార్టీలకు సైతం బిల్లుపై మాట్లాడే అవకాశం కల్పించడం వెంకయ్యనాయుడు గొప్పతనానికి నిదర్శనమన్నారు. ఆరేళ్ల కిందట సభలో అడుగుపెట్టినప్పుడు చివరి వరసలో కూర్చున్న తనకు మాట్లాడే అవకాశం వస్తుందో రాదోనని సంశయిస్తున్న తరుణంలో అంతమందిలో కూడా తనను గుర్తించి తనకు మాట్లాడే అవకాశం కల్పించారని గుర్తుచేసుకున్నారు.

పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీలకు వెంకయ్యనాయుడు ఇచ్చిన ప్రాధాన్యత ఎనలేనిదన్నారు. వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌గా రాజ్యసభ అధ్యక్షస్థానంలో కూర్చుని సభను నిర్వహించే అవకాశం కల్పించడం తన జీవితంలో మరపురానిదని చెప్పారు. వెంకయ్యనాయుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top