చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు..

YSRCP MLA TJR Sudhakar Babu Fires On CPI Ramakrishna - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు

సాక్షి,తాడేపల్లి: టీడీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ రామకృష్ణ చీఫ్‌ గెస్ట్‌గా మాట్లాడినట్లుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీపీఐ రామకృష్ణ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఎన్నో ఉద్యమాలు వైఎస్సార్‌సీపీ చేపడితే ఏ ఒక్క రోజు కూడా రామకృష్ణ కలిసి రాలేదన్నారు. అమరావతి భూముల పోరాటాలపై, దళితులపై దాడుల వంటి విషయాల్లో ఏ ఒక్క రోజూ అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదన్నారు. ఈ రోజు దళితులు, మహిళలపై దాడి అంటూ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. భూస్వాములకు రామకృష్ణ మద్దతుగా నిలుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

ప్రభుత్వం ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఏ ఒక్క రోజు కూడా ఆయన మాట్లాడలేదని ధ్వజమెత్తారు. ‘‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియానా లేక చంద్రబాబు పార్టీ ఆఫ్‌ ఇండియానా’’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసే జుగుప్సాకర రాజకీయాలకు ఆయన సాక్షిగా నిలుస్తున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయనకు సీపీఐ వత్తాసు పలికిందని, బాబు హయాంలో దళితులపై దాడులు జరిగితే నోరెందుకు ఎత్తలేదని ఆయన ప్రశ్నించారు. (చదవండి: బాబు ప్రయోజనాల కోసమే రౌండ్‌టేబుల్‌ సమావేశం)

కేవలం వైఎస్‌ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే ఆ రౌండ్ టేబుల్ పెట్టినట్లు ఉందని ఆయన నిప్పులు చెరిగారు. చివరికి అమ్మ ఒడిని కూడా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు చేసే క్షుద్ర రాజకీయాలకు బలిపశువు అవుతున్నారు. వైఎస్‌ జగన్‌పై మతం ముద్ర వేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు నిజంగా ప్రజలలో సమస్య ఉంటే ఇలా పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమం చేయించాల్సిన అవసరం ఏముంది...? ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. రాజ్యసభ ఇస్తానని రోడ్డు పైన నిలబెట్టిన విషయం వర్ల రామయ్య మర్చిపోయారా..? దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చంద్రబాబు అంటే... ఆ దళితులను గుండెల్లో పెట్టుకున్నారు వైఎస్‌ జగన్. చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని సుధాకర్‌ బాబు హితవు పలికారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top