ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలంటే ఇది అవసరం
భద్రతా బాధ్యతలను రాష్ట్ర పోలీసులకు అప్పగిస్తే న్యాయం జరగదు
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ లేఖలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ అభ్యర్థులకు తగినంత భద్రత కల్పించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు భయం, బెదిరింపులు లేకుండా తమ నామినేషన్ పత్రాలను జిల్లా కేంద్రాల్లో సమర్పించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తిచేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, రసీదుల జారీ, సంబంధిత అధికారులకు పత్రాల బదిలీ ప్రక్రియలో స్పష్టమైన విధానాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు శుక్రవారం వేర్వేరుగా లేఖలు రాశారు. లేఖల్లోని ముఖ్యాంశాలు..
ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలపై రాజకీయ బెదిరింపులు, దాడులు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలి. కేంద్ర బలగాల మోహరింపు ఎన్నికల సంఘం సమర్థవంతమైన పర్యవేక్షణలో జరగాలి. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై రాజకీయ బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల భద్రత బాధ్యతలను పూర్తిగా రాష్ట్ర పోలీసులకు అప్పగిస్తే నిష్పక్షపాత వాతావరణం ఉంటుందన్న విశ్వాసం మాకు లేదు. ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, అధికార యంత్రాంగాన్ని లేదా ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలి.
నామినేషన్లనూ అడ్డుకునే అవకాశం
కూటమి పాలనలో ప్రతిపక్ష అభ్యర్థులు బెదిరింపులు, దాడులు, రాజకీయ ప్రేరేపిత పోలీసు చర్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో ఇవి మరింత తీవ్రమై, ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడం, ప్రచారాన్ని నిరోధించడం వంటి పరిణామాలకు దారితీయవచ్చు. పోలింగ్ రోజు మాత్రమే భద్రత కల్పించడం సరిపోదు. నామినేషన్ల ప్రారంభానికి ముందే కేంద్ర బలగాలను మోహరించి, ఫలితాలు ప్రకటించే వరకు కొనసాగించాలి.
ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు వివక్ష లేకుండా అనుమతులు ఇవ్వాలి.∙ప్రతిపక్ష అభ్యర్థులు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లు తమ చట్టబద్ధమైన ఎన్నికల బాధ్యతలను నిర్వహించకుండా అడ్డుకోవడానికి పోలీసు అధికారాలను ఉపయోగించకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలి.


