వైఎస్సార్: జమ్మలమడుగు నియోజకవర్గంలో రేపు (బుధవారం) వైఎస్సార్‌సీపీ ఉన్నత స్థాయి నేతల బృందం పర్యటించనుంది. సున్నపురాళ్లపల్లె పరిధిలోని జిందాల్ (జేఎస్‌డబ్ల్యూ) స్టీల్‌ప్లాంట్ నిర్మాణ ప్రాంతాన్ని ఈ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే భూమి పూజ పూర్తయి, పనులు కూడా ప్రారంభమైన జిందాల్ స్టీల్ ప్లాంట్‌కు.. చంద్రబాబు మళ్లీ భూమి పూజ చేస్తూ ‘క్రెడిట్ చోరీ’కి పాల్పడటాన్ని ప్రజల ముందుంచనుంది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ పారిశ్రామిక ప్రగతి కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగానే జిందాల్ స్టీల్స్ పరిశ్రమ స్థాపన కోసం ఏకంగా 3,500 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు, పరిశ్రమకు అవసరమైన నీరు, విద్యుత్ వంటి అన్ని రకాల మౌలిక వసతులను, సౌకర్యాలను సమకూర్చారు. అనంతరం 2023 ఫిబ్రవరి 15న వైఎస్ జగన్ అధికారికంగా ఈ మెగా స్టీల్‌ప్లాంట్‌కు భూమి పూజ చేశారు.
ప్రభుత్వ అండదండలు, మౌలిక వసతులు సకాలంలో అందడంతో జిందాల్ యాజమాన్యం కూడా ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను గతంలోనే వేగంగా ప్రారంభించింది.
అయితే, వైఎస్ జగన్ శ్రమించి తెచ్చిన ఈ ప్రతిష్టాత్మక స్టీల్‌ప్లాంట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరతీసింది. జులై 3న చంద్రబాబు మళ్లీ ఇదే జిందాల్ స్టీల్‌కు భూమిపూజ చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో 2018లోనూ ఎలాంటి పారిశ్రామిక భాగస్వామి లేకుండా కేవలం శిలాఫలకానికే చంద్రబాబు పరిమితమయ్యారని, ఇప్పుడు వైఎస్ జగన్ తెచ్చిన కంపెనీకి తామేదో కొత్తగా భూమి పూజ చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తతున్నాయి.
కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రచార ఆర్భాటాలను, అబద్ధాలను ప్రజలకు వివరించేందుకు రేపు ఉదయం వైఎస్సార్‌సీపీ బృందం స్టీల్ ప్లాంట్ స్థలానికి చేరుకోనుంది. అక్కడ ఇప్పటికే జరిగిన పనుల పురోగతిని పరిశీలించి, వైఎస్ జగన్ హయాంలో జరిగిన వాస్తవ అభివృద్ధిని మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజల ముందు ఉంచనుంది.


