
రాజమహేంద్రవరం: నగరంలో కుర్రాళ్లను పాడు చేస్తూ, శాంతిభద్రతల విఘాతానికి కారణమవుతున్న టీడీపీ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు బండారం బయటపెడతామని, ఆయనను ప్రజల ముందు దోషిగా నిలబెడతామని వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నగర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిరెడ్డి వాసు కుర్రాళ్లను వివిధ కేసులలో ఇరికించి, వాళ్లను బయటకు తీసుకు వచ్చేందుకు, బెయిల్ పెట్టేందుకు అప్పులు ఇచ్చి, ప్రోనోట్లు రాయించుకుని, ఎన్నో కుటుంబాలను సర్వ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరంలో నెల రోజుల వ్యవధిలో ఐదు వరుస హత్యలు జరిగాయని, వాటి వెనుక ఎవరి హస్తముందో పోలీసులు త్వరలోనే బయట పెట్టనున్నారని అన్నారు. ఆదిరెడ్డి వాసు డాక్టర్లను భయపెట్టి బలవంతంగా చీటీలు వేయిస్తున్నారన్నారు. ఆయన ఇంట్లో సోదాలు చేస్తే వందలాది ప్రోనోట్లు బయట పడతాయన్నారు. సిటీ ఎమ్మెల్యే భవాని ఉన్నట్టే తెలియడం లేదని, ఆమె స్థానంలో భర్త ఆదిరెడ్డి వాసు, మామ అప్పారావు చలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం గూర్చి టీడీపీ శ్రేణులు మాట్లాడితే ప్రజలు నవ్వుతున్నారని విమర్శించారు. ఆదిరెడ్డి కుటుంబంలోని మనిషిని ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించామా అని నగర ప్రజలు మధనపడుతున్నారన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ప్రజల మద్దతుతో వైఎస్సార్ సీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ గురించి వారు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జన్మభూమి కమిటీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో ఎటువంటి విన్యాసాలు చేశారో ప్రజలకు తెలుసునని చెప్పారు. ప్రొటోకాల్ గురించి ఎవరి దగ్గరో నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. మీడియా నిజానిజాలు తెలుసుకుని రాయాలని, కొన్ని మీడియాలు చూపించే విషయాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆకుల అన్నారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, మాజీ ఫ్లోర్‌లీడర్, రాష్ట్ర కార్యదర్శి పోలు విజయలక్ష్మి, బీసీ సెల్ నగర అధ్యక్షుడు మజ్జి అప్పారావు, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు కాటం రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు.