
విజయవాడ: శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుకు జరిగిన అవమానంపై సీఎం చంద్రబాబు నాయుడు వివరణ ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది.
ప్రధానంగా అసెంబ్లీ భననాల ప్రారంభ కార్యక్రమానికి, తిరుపతిలో జరిగిన మహిళా ఎమ్మెల్యేల సదస్సుకి ఇలా పలు సందర్భాల్లో మండలి చైర్మన్ మోషేన్ రాజును ఆహ్వానించకపోవడాన్ని వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 26వ తేదీ) మండలి సమావేశాల్లో భాగంగా ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చింది వైఎస్సార్‌సీపీ.
దీనికి మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ.. మోషేన్ రాజు తిరుపతి సభకు రానన్నారని, అధికారులు ఈ విషయం చెప్పారన్నారు. దీనిపై చైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను తప్పుదోవ పట్టించకండి అంటూ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే మండలి చైర్మన్‌పై మంత్రి అచ్చెన్న చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. గతంలో ఓ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా కూడా మండలి చైర్మన్‌ను అవమానించిన సంగతిని బొత్స గుర్తు చేశారు. మండలి చైర్మన్‌గా ఉన్న వ్యక్తి దళిత వర్గానికి చెందిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని అవమానించినందుకు ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దీనిలో భాగంగా మండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. మండలి చైర్మన్‌ను అవమానించినందుకు సీఎం వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు దీనిపై ఎదో ఒకటి తేల్చండి అని మండలి చైర్మన్ కోరగా, మంత్రులు ఎవరూ నోరు మెదపలేదు. దీంతో వైఎస్సార్‌సీపీ ఆందోళన చేపట్టింది. దాంతో సభను వాయిదా వేశారు చైర్మన్.
విషయంలోకి వెళితే.. నిన్న(గురువారం, సెప్టెంబర్ 25 వతేదీ) అసెంబ్లీలో పలు భవనాలను ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి కనీసం మండలి చైర్మన్‌గా ఉన్న మోషేన్ రాజును ఆహ్వానించలేదు. ఇదే విషయాన్ని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రధానంగా ప్రస్తావించారు. స్పీకర్, మంత్రులు ఉండి కూడా చైర్మన్‌ను ఆహ్వానించలేదన్నారు. తిరుపతిలో మహిళా ఎమ్మెల్యేల సదస్సు జరిగిందని, దానికి కూడా మండలి చైర్మన్‌ను ఆహ్వానించలేదని బొత్స పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన సదస్సు మీ పార్టీదా? అంటూ ప్రశ్నించారు బొత్స. మండలి చైర్మన్‌కు పదే పదే అవమానం జరగడాన్ని ఖండించారు బొత్స. దీనికి మంత్రి లేదా సభా నాయకుడు, ముఖ్యమంత్రి వచ్చి సమాధానం చెప్పారా..? చెప్పాలి’ అంటూ బొత్స డిమాండ్ చేశారు.

ప్రభుత్వం అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వడం లేదు..
ప్రభుత్వం అందరికీ పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు బొత్స. స్పౌజ్ పెన్షన్లలో ఎవరో ఒకరు చనిపోతే ఆ తర్వాత వాళ్ళలో ఒకరికి ఇస్తున్నారు తప్ప కొత్తగా ఎవరికీ ఇవ్వటం లేదన్నారు. 16 నెలల నుంచి పెన్షన్ల కోసం ఎంతో మంది చూస్తున్నారని, పెన్షన్లను ప్రభుత్వం తగ్గించుకుంటూ వస్తున్నారు తప్ప కొత్తగా ఎవరికీ ఇవ్వలేదన్నారు. ‘ మా ప్రభుత్వ హయంలో అర్హులందరికీ ఇచ్చాం. విడో పెన్షన్లు ప్రతీ ఏటా రెండు విడతలుగా అర్హులను గుర్తించి ఇచ్చాం. మంత్రులు పూర్తిగా వాస్తవాలు కనుక్కుని చెప్పాలి’ అని బొత్స సూచించారు.