బాలకృష్ణ ముంచేశాడు!

YSRCP Councillors Fire On Hindupur MLA Balakrishna - Sakshi

అనంతపురం (హిందూపురం): ‘‘హిందూపురంలో తాగునీటి సమస్య తీరుస్తామని గొప్పలు చెప్పిన ఎమ్మెల్యే బాలకృష్ణ మున్సిపాలిటీపై అప్పుల కుప్ప పెట్టాడు.  ‘అమృత్‌’ పథకం కింద గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి హిందూపురం వరకు నూతన పైప్‌లైన్‌కు రూ.194 కోట్లు ఖర్చుకాగా, కేంద్రం వాటాగా రూ.56.83 కోట్లు ఇచ్చింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.22 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. మున్సిపాలిటీ వాటా కింద    మిగతా మొత్తం రూ.114.67 కోట్లు చెల్లించారు. అప్పుడు చేసిన అప్పులకు ఇప్పటి మున్సిపాలిటీ ఆదాయంతో పాటు 14, 15 ఫైనాన్స్‌ నిధులూ వడ్డీలకే సరిపోతున్నాయి. అయినా మీరు మూడు దశాబ్దాల్లో చేయలేని పనులు మేము మూడేళ్లలోనే చేసి చూపించాం.’’ అని వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు టీడీపీ కౌన్సిలర్లకు సమాధానం ఇచ్చారు. 

1983 నుంచి టీడీపీ నాయకులే హిందూపురం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నా.. కనీసం డ్రైనేజీ కూడా వేయించలేకపోయారని, ఇప్పుడు అధికార పార్టీ ఏం చేసిందో చెప్పాలని అడిగేందుకు టీడీపీ కౌన్సిలర్లకు సిగ్గుండాలన్నారు.  ఆర్థిక ఇబ్బందులున్నా హిందూపురం అభివృద్ధికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తొలుత వైస్‌ చైర్మన్‌ బలరామిరెడ్డి, కౌన్సిలర్‌ శివ మాట్లాడుతూ... సచివాలయాల పరిధిలో జరిగే అభివృద్ధి పనుల విషయాలు వార్డు సభ్యులకూ తెలియజేయాలని కోరారు. అప్పుడే వివిధ సమస్యలతో తమ వద్దకు వచ్చే ప్రజలకు తాము సమాధానం చెప్పగలమన్నారు. 

అలాగే నిర్మాణంలో ఉన్న ఓపెన్‌ షెడ్లు ఎన్ని..?,  నిర్మాణ నిబంధనలు, వాటి నుంచి వస్తున్న ఆదాయ వివరాలు సభ్యులకు తెలపాలని కోరారు. అలాగే పన్నుల విషయంలో ప్రజలు అహుడా, మున్సిపాలిటీలకు చెల్లిస్తూ రెండు విధాలుగా నష్టపోతున్నారని, దీనిపై వార్డు అడ్మిన్‌ సెక్రటరీలతో మీటింగ్‌ ఏర్పాటు చేసి వార్డుల వారీగా ఏ నిర్మాణాలు అహుడా పరిధిలోకి వస్తాయి...ఏవి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 

► కమిషనర్‌ వెంకటేశ్వరరావు సమాధానమిస్తూ... సచివాలయాల పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, నీటి సమస్యలు..పరిష్కారానికి తీసుకున్న చర్యలతో పాటు ఇతర వివరాలన్నీ సభ్యులకు వివరిస్తామన్నారు.  

అనంతరం కౌన్సిలర్‌ గిరి మాట్లాడుతూ... తన వార్డులో ఇప్పటికే రూ.2.50 కోట్ల అభివృద్ధి పనులు చేస్తే... కొందరు యాత్రలపేరుతో వార్డులో ఏం జరగలేదని నోటికివచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారు కనీసం మున్సిపాల్టీకి వచ్చి లెక్కలు చూసి మాట్లాడాలన్నారు.
  
 కౌన్సిలర్‌ ఆసీఫుల్లా మాట్లాడుతూ..     మున్సిపాలిటీలో కొందరు అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, ఇటీవల ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారని కౌన్సిల్‌ దృష్టికి తీసుకువచ్చారు. పారదర్శకత కోసం మున్సిపాలిటీకి ఒక యాప్‌ తయారుచేసి అందులో మొత్తం వివరాలు పెడితే, అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ఇటీవల విద్యానగర్‌లోని ఒక ఇంటి యజమానికి ప్రాపర్టీ టాక్సు విషయంలో రీవోక్‌ చేయాలని నోటీస్‌ పంపారని, అధికారులు మారితే పన్నులు మారతాయా..అని     ప్రశ్నించారు. ప్రతినెలా ప్రాపర్టీ ట్యాక్సుల నోటీæసులు ఇచ్చినవాటి వివరాలు కౌన్సిల్‌కు తెలపాలన్నారు.  

► పలువురు సభ్యులు మాట్లాడుతూ.. మార్కెట్‌ వల్ల ఎంజీఎం మైదానం అధ్వానంగా మారుతోందని, వ్యాపారులకు ఇబ్బందులు కలగకూడదంటే వారిని మరోచోటకు పంపి...మైదానాన్ని క్రీడాకారులకు అందుబాటులో ఉంచాలని కమిషనర్‌ను కోరారు. అనంతరం 57 అంశాలతోపాటు టేబుల్‌ అజెండా అంశాలను తీర్మానిస్తూ ఆమోదం తెలిపారు. 

టీడీపీ కౌన్సిలర్ల రభస 
అంతకుముందు ‘పురం’ అభివృద్ధికి మూడేళ్లలో ఏం చేశారో చెప్పాలంటూ టీడీపీ కౌన్సిలర్లు సభలో రభస చేశారు. ఇందుకు వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ నాగేంద్రబాబు మాట్లాడుతూ...వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ‘పురం’ దాహార్తి తీర్చడానికి పీఏబీఆర్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు చేస్తే రాజకీయం చేసి సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. నాసిరకం పైపులని నానా యాగీ చేసిన టీడీపీ వారి హయాంలో చేసిందేమిటో చెప్పాలన్నారు. గత మూడేళ్లుగా అదే పీఏబీఆర్‌ పైపుల నుంచే తాగునీరు పల్లెలు, ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయని, అవి నాసిరకమైతే ఎందుకు పగలడం లేదో చెప్పాలన్నారు. టీడీపీ నేతలు స్వార్థం, స్వలాభం కోసం ఏపీబీఆర్‌ నీటి పథకాన్ని నిరీ్వర్యం చేసి, గొల్లపల్లి పైప్‌లైన్‌ తెరపైకి తెచ్చారన్నారు. దీనిపై టీడీపీ కౌన్సిలర్లు అభ్యతరం తెలపగా వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు దీటైన సమాధానం ఇచ్చారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగి అరుపులతో అడ్డుకోవడానికి ప్రయతి్నంచగా వైస్‌ చైర్మన్‌ జబివుల్లా సర్దిచెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top