
తీవ్రంగా గాయపడిన శశిధర్‌ను చూపిస్తూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్ జగన్
రైతులు తమ గోడును ప్రతిపక్ష నేతకు చెప్పుకోకూడదా?
జాతీయ రహదారిపై, ఊరూరా.. సందు సందునా చెక్‌పోస్టులు పెడతారా?
డీఐజీ, మూడు జిల్లాల ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 17 మంది డీఎస్పీలతో ఎవరికి భద్రత?.. వీరితోపాటు సీఐలు, ఎస్‌ఐలు సహా 2,000 మందికి పైగా పోలీసులంతా రైతులను అడ్డుకోవడానికే పరిమితం
జగన్ పర్యటనకు వెళ్తారేమోనని బైక్‌లకు పెట్రోల్ పోయకుండా అడ్డుకున్న వైనం
వందల మందిని కొట్టడం.. అరెస్ట్‌లు చేయడం.. నోటీసులివ్వడం ఎవరి కోసం?
మీడియాను, ఫొటోగ్రాఫర్లను, డ్రోన్లను సైతం అడ్డుకోవడం ఎందుకు?
తుదకు మాజీ సీఎం వైఎస్ జగన్‌కు మాత్రం భద్రత కల్పించలేదు
ఇదంతా ఎందుకంటే ‘కూటమి’ అరాచకాలు ప్రపంచానికి తెలుస్తాయని భయం
పోలీసులు అమానుషంగా వ్యవహరించారని అందరికీ తెలుస్తుందని జంకు
అయినా ఆంక్షలు లెక్క చేయక వేల సంఖ్యలో విచ్చేసి కదంతొక్కిన రైతులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో బుధవారం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌కు వెళ్తున్న క్రమంలో వైఎస్ జగన్‌ను కలిసేందుకు వచ్చిన రైతులు, మహిళలు, వృద్ధులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కొన్నిచోట్ల లాఠీచార్జ్ చేశారు.
పోలీసుల దాడిలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం కార్యదర్శి శశిధర్ రెడ్డి తలకు తీవ్ర గాయమై, రక్తస్రావం అయింది. దీన్ని గమనించిన జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. ఇంత దారుణంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని నిలదీశారు. శశిధర్ రెడ్డికి వెంటనే మంచి వైద్యం అందించాలని వైఎస్సార్‌సీపీ నేతలకు సూచించారు. బాధితుడిని పరామర్శించడాన్ని కూడా ఎస్పీ అడ్డుకున్నారు.

రూట్‌మ్యాప్ మార్చే యత్నం
వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌కి ముందుగా అనుమతి తీసుకున్న రూట్ మ్యాప్ ప్రకారం వెళ్తున్నా.. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల ఎస్పీలు మణికంఠ, విద్యాసాగర్ నాయుడు కాన్వాయ్ ముందుకు వచ్చి రూట్ మ్యాప్ మార్చే ప్రయత్నం చేశారు. సబ్‌వేలో వెళ్లాల్సిన కాన్వాయ్‌ని నేషనల్ హైవేపైకి మళ్లించమన్నారు. ముందుగా అనుమతి తీసుకున్న రూట్ మ్యాప్‌లోనే కాన్వాయ్ వెళ్తుంటే ఎందుకు అడ్డు పడుతున్నారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పైగా నేషనల్ హైవేపై కాన్వాయ్ వెళితే అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడతారని, అందుకే సబ్‌వేలో ముందుకు వెళతామన్నారు. అనంతరం సబ్ వే ద్వారానే బంగారుపాళ్యం చేరుకున్నారు. పోలీసుల ఓవర్ యాక్షన్ వల్ల చిత్తూరు, బెంగళూరు హైవే మీద చాలా సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సీనియర్ నేతలను సైతం అడ్డుకున్న వైనం
మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను సైతం పోలీసులు లెక్క చేయలేదు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా బంగారుపాళ్యం చేరుకునేందుకు వాహనాల్లో వస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్‌కే రోజా, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సునీల్‌కుమార్, వెంకటేగౌడ్, వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి వాహనాలను అడ్డుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అని పోలీసులు చులకనగా వ్యవహరించారని ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్, ఆయన అనుచరులను అడ్డుకుని వారిపై లాఠీచార్జ్ చేశారు. విజయానందరెడ్డి పట్ల చాలా దురుసుగా వ్యవహరించారు.
ఒకానొక సమయంలో పోలీసులు తోసెయ్యడంతో విజయానందరెడ్డి కింద పడిపోయారు. ‘సాక్షి’ విలేకరులపైనా ఎస్‌ఐ సుబ్బరాజు దురుసుగా వ్యవహరించారు. సాక్షి వారిని కొట్టుకుంటూ పోతే మరోసారి రారంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. మార్కెట్ యార్డు వద్ద కొందరు జర్నలిస్టులు తెల్ల చొక్కాలు ధరించడాన్ని కూడా పోలీసులు తప్పుపట్టారు. అక్రిడిటేషన్ కార్డు చూపించినా వారి వ్యవహార శైలి మారలేదు.

‘మామిడి’ వేదన.. రైతు రోదన!
చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలానికి చెందిన నలుగురు రైతులు మామిడి కొనుగోలు చేసే వారు లేక విసిగిపోయారు. ప్రభుత్వం నుంచి భరోసా లేకపోవడంతో ఆవేదన గురయ్యారు. ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకోవాలని వచ్చారు. అదే సమయంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో మామిడి పంటను తిమ్మోజీపల్లి వద్ద రోడ్డుపై పారబోసి ఆవేదన వ్యక్తం చేశారు. కంట తడి పెడుతూ జగనన్నా.. నీవే దిక్కు అంటూ వెళ్లిపోయారు.

రైతులను అడ్డుకోడానికి ఇంత మంది పోలీసులా?
జగన్ రాకకు ముందు ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయోగించిన పోలీస్ బలగాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రాయలసీమ డీఐజీ, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 17 మంది డీఎస్పీలు, సీఐలు, ఎస్‌లు సహా 2,000 మంది పోలీసులు జగన్ పర్యటనలో పాల్గొన్నారు. వీళ్లంతా జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత కల్పించడానికి అనుకుంటే తప్పులో కాలేసినట్టే. కేవలం జగన్ అనే నాయకుడిని బంగారుపాళ్యం వెళ్లకుండా, మరీ ముఖ్యంగా ఆయన కోసం జనం ఎవరూ అటు వైపు కన్నెత్తి చూడకుండాం ఉండటం కోసమే పని చేశారు.

ఎక్కడ చూసినా ఖాకీ యూనిఫాంలో గుంపులు గుంపులుగా కనిపించారు. యథేచ్ఛగా లాఠీలు సైతం ఝుళిపించారు. జగన్‌కు భద్రత కల్పించడంలో మాత్రం పోలీసుశాఖ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. వారంతా చిత్తూరు నుంచి పలమనేరు వరకు మోహరించి.. బస్సులు, స్కూటర్లు, బైక్‌లు, కార్లలో వచ్చే వాళ్లను నిలువరించడంపైనే దృష్టి సారించారు. తీరా వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్ యార్డు లోపలకు అడుగు పెట్టగానే ఒక్క పోలీసు కూడా కనిపించలేదు. కేవలం ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది తప్ప.. కానిస్టేబుల్ కూడా సమీపంలో లేరు. దీంతో వేలాది సంఖ్యలో తరలి వచి్చన జనం.. వైఎస్ జగన్‌ను చుట్టేశారు.
జగన్‌ను వెనుక వైపు నుంచి లాగుతూ, ఆయన చేతులు లాగేస్తూ మీద మీదకు వెళ్లిపోయారు. ఓ దశలో వైఎస్ జగన్ కిందకు తూలి పోతుండగా వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఇంత మంది జనం మధ్య ఆయన మార్కెట్ లోపల రైతుల వద్దకు వెళ్లడానికి అరగంట పైనే సమయం పట్టింది. జెడ్ ప్లస్ భద్రత ఉన్న ఓ వీఐపీని ఇలా జన సమూహంలో వదిలేసి, పోలీసులు చోద్యం చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. జెడ్ ప్లస్ భద్రత అంటే ఇదేనా అని వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపట్టాయి.