
కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశ, శ్వాస మూడు రాజధానులేనని వైఎస్సార్‌సీపీ నాయకులు పునరుద్ఘాటించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో టెంకాయలు కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బద్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ఆదిచెన్నకేసవవ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మూడు రాజధానులకు మద్దతుగా 101 టెంకాయలు కొట్టారు. వికేంద్రీకరణ వల్లే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధిచెందుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
మూడు రాజధానులకు మద్దతుగా కడపలోని ఎర్రముక్కపల్లెలో శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో వైఎస్సార్‌సీపీ నాయకులు 101 టెంకాయలు కొట్టి , ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, టీఎస్సార్, ఎన్. సుబ్బారెడ్డి, సుబ్బరాయుడు, శ్యాంసన్ పాల్గొన్నారు.
పులివెందులలోని అంకాలమ్మ గుడిలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వికేంద్రీకరణ కావాలని కోరుతూ కమలాపురంలో వైఎస్సార్‌సీపీ నాయకులు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. పెండ్లిమర్రి వీరభద్ర స్వామి ఆలయంలో మండల కన్వీనర్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరపునాయినిపల్లెలోని అభయాంజనేయస్వామి ఆలయంలో మండల కన్వీనర్ రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో టెంకాయలు కొట్టారు.