మరింత చేరువగా.. ఆరోగ్యశ్రీ, గ్రామ స్థాయి నుంచే రిఫరల్‌ విధానం 

YSR Aarogyasri Scheme Helping Poor and middle class families - Sakshi

గ్రామాల నుంచే ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీల ద్వారా ఆరోగ్య మిత్ర సేవలు 

గ్రామ స్థాయి నుంచే నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రోగులను రిఫర్‌ చేసే వీలు 

15 నుంచి గ్రామాలకే ఫ్యామిలీ డాక్టర్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 1.40 కోట్లకు పైగా పేద, మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యాలకు శ్రీరామ రక్షగా నిలుస్తోంది.. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం. టీడీపీ  హయాంలో పూర్తిగా నిర్వీర్యమైన ఈ పథకానికి ఊపిరిలూదుతూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టింది. ఏకంగా 2,446 చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చింది. వీటి సంఖ్యను ఇంకా పెంచేందుకు కసరత్తు చేస్తోంది.

కాగా ఈ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పట్టణాలు, నగరాల్లోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వెళ్లడానికి, ఏ జబ్బుకు ఎక్కడ చికిత్స చేస్తారో తెలియక ప్రజలు పలు సందర్భాల్లో ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి కష్టాలకు తావివ్వకుండా గ్రామ స్థాయి నుంచే రిఫరల్‌ విధానాన్ని వైద్య శాఖ ప్రవేశపెడుతోంది.  

గ్రామస్థాయి నుంచే ఆరోగ్య మిత్ర 
గ్రామ స్థాయిలోనే ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం గ్రామ సచివాలయ ఏఎన్‌ఎం, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) ద్వారా గ్రామ ఆరోగ్య మిత్ర సేవలను వైద్య శాఖ అందించబోతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీలకు ఆరోగ్య మిత్ర విధులపై శిక్షణ ఇస్తున్నారు. గ్రామ సచివాలయం/విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయి నుంచే రోగులను నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నారు.  

గ్రామం నుంచి నేరుగా నెట్‌వర్క్‌ ఆస్పత్రికి.. 
ఆగస్టు 15 నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానాన్ని వైద్య శాఖ అమలు చేయనుంది. ఈ క్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) వైద్యులు 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ)తో పాటు గ్రామాల్లోకి వెళ్లి వైద్య సేవలు అందించనున్నారు. రోగికి మెరుగైన వైద్య సేవలు అవసరమని భావిస్తే వెంటనే ఆస్పత్రికి తరలించాలని ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీకి సూచిస్తారు. సంబంధిత చికిత్స ఏ ప్రభుత్వ/ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రిలో చేస్తారో గుర్తించి.. రోగిని ఆ ఆస్పత్రికి గ్రామ ఆరోగ్య మిత్ర రిఫర్‌ చేస్తారు. అంతేకాకుండా రోగి ఆస్పత్రికి వెళ్లేలోగా అక్కడి ఆరోగ్య మిత్రను అప్రమత్తం చేసి.. ఆస్పత్రిలో చేర్చి వైద్య సేవలు అందేలా సమన్వయం చేస్తారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రిలో చికిత్స పొంది.. రోగి ఇంటికి చేరుకుని పూర్తిగా కోలుకునే వరకూ గ్రామ ఆరోగ్య మిత్ర అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తారు. అలాగే సాధారణ పరిస్థితుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వారిని కూడా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేసి వైద్యం అందేలా చూస్తారు.   

రెండు రోజులు శిక్షణ ఇవ్వనున్నాం.. 
ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు పొందడానికి ప్రజలు ఇబ్బందులు పడకూడదనేది సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం. పథకం కింద పేద, మధ్యతరగతి ప్రజలకు సులువుగా వైద్యాన్ని చేరువ చేసేందుకు గ్రామ ఆరోగ్య మిత్ర విధానాన్ని ప్రవేశపెట్టాం. ఆరోగ్య మిత్ర విధులపై ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీలకు ఈ వారంలో రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నాం. ఇప్పటికే మాస్టర్‌ ట్రైనర్‌లకు శిక్షణ పూర్తయింది. వీరు జిల్లాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 
 – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top