వైఎస్‌ఆర్.. ఈ పేరు పేదల సొంతింటి కలను సాకారం చేసింది. ఆపదలోని ఎందరి ప్రాణాలనో నిలిపింది. పేదింటి పిల్లల్ని ఇంజినీర్లు, డాక్టర్లు, ఉన్నత విద్యావంతుల్ని చేసింది. వ్యవసాయాన్ని పండుగ చేసింది. ఇందిరమ్మ, జలయజ్ఞం, 108, 104, పింఛన్లు, పావలా వడ్డీ, రుణమాఫీ తదితర పథకాలతో ఆయన పాలన స్వర్ణయుగాన్ని తలపించింది. అందుకే వైఎస్సార్ పేరు వింటే పేదల మోములు వికసిస్తాయి. వారి హృదయాలు ఆనందంతో నిండిపోతాయి.
నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా..
నమస్తే.. నమస్తే.. నమస్తే బాబు.. నమస్తే పాప.. నమస్తే.. నమస్తే.. నమస్తే. అంటూ ఆత్మీయంగా పిలిచే పెద్దాయన దివికేగి ఏళ్లు గతించినా పేదల గుండెల్లో గూడుకట్టుకుని ఉన్నారు. వైఎస్ 77వ జయంతి సందర్భంగా బుధవారం జిల్లా అంతటా వేడుకలు, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల నిర్వహణకు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాట్లు చేశారు.
సాక్షి, భీమవరం : జిల్లాతో దివంగత వైఎస్సార్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. రాజకీయ ప్రస్థానంలో పలుమార్లు జిల్లాకు విచ్చేసిన వైఎస్సార్ ఇక్కడి ప్రజలతో మమేకమయ్యేవారు. చోటామోటా నాయకులను పేరుపేరునా పలకరించేవారు. పెద్దాయన ఆతీ్మయ పలకరింపుతో ప్రజలు ఉబ్బితబ్బిబ్బయ్యేవారు.
ప్రగతి పరవళ్లు
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి భీమవరం పట్టణ పరిధిలో 82 ఎకరాలు, ఆకివీడు మండలం తాళ్లకోడులో 74 ఎకరాలు, నరసాపురంలో 15 ఎకరాలు, పాలకొల్లులో 70 ఎకరాలు, పెనుగొండలో 36 ఎకరాలు, తణుకులో 14 ఎకరాలు, జిల్లా అంతటా వందల ఎకరాలు సేకరించారు. వేలాది మందికి సొంత గూడును సమకూర్చారు.ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు 32 వేల మందికి దాదాపు రూ.150 కోట్ల విలువైన వైద్యసేవలు అందించారు. అర్హులందరికీ పింఛన్ల మంజూరు, పావలా వడ్డీ రుణాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర పథకాలు ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేశారు.
దక్షిణ భారత దేశంలో మొదటిగా 2007లో హార్టికల్చర్ యూనివర్శిటీని తాడేపల్లిగూడెం రూరల్ వెంకట్రామన్నగూడెంలోని 220 ఎకరాల్లో ఏర్పాటుచేశారు. దేశవ్యాప్తంగా ఉద్యాన రైతులకు సేవలు అందిస్తున్న ఈ వర్శిటీ ద్వారా 23 రకాల వంగడాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.
డెల్టా ఆధునికీకరణలో సుమారు రూ.140 కోట్లతో కాలువల అభివృద్ధితో పాటు రుణమాఫీ, పావలా వడ్డీ రుణాలు, ఉచిత విద్యుత్, కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీ కార్యక్రమాల ద్వారా సాగును పండగ చేశారు.
నరసాపురం రూరల్ పేరుపాలెం బీచ్‌కు అనుంసంధానంగా రోడ్లను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు.
భీమవరంలో సమ్మర్ స్టోరేజి ట్యాంకు–2, యనమదుర్రు డ్రెయిన్‌పై ఐదు వంతెనలు, పాలకొల్లు మండలం శివుదేవని చిక్కాలలో సాగునీటికి ఎత్తిపోతల పథకం, తాడేపల్లిగూడెంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల స్థాపన, ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్, రూ.34 కోట్లతో యాగర్లపల్లి వద్ద రెండో ఫ్లైఓవర్, ఎరక్రాలువపై అప్పారావుపేట, వీరంపాలెం, మాధవరం కంసాలిపాలెం వద్ద మూడు వంతెనలు, మోడ్రన్ లైబ్రరీ తదితర అభివృద్ధి పనులు వైఎస్ హయాంలో చేసినవే.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకున్నా
ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇంజనీరింగ్ చదువుకుని రైల్వే లోకో పైలెట్ ఉద్యోగం సాధించాను. నేడు సీనియర్ అసిస్టెంట్ లోకో పైలెట్‌గా పనిచేస్తున్నాను. నా ఉన్నత స్థితికి వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకమే కారణం. ఆయన చేసిన మేలును ఎన్నటికి మరువలేను.
– కడలి బాలకృష్ణ, పడమటిపాలెం, వీరవాసరం మండలం
నా ప్రాణం నిలిపాడు
కూలి పని చేసుకుని జీవించే నాకు గుండె జబ్బు రావడంతో నా పని అయిపోయిందనుకున్నాను. పిల్లల పరిస్థితి ఏమిటని దిగులుచెందుతున్న సమయంలో ఆరోగ్యశ్రీ ఆదుకుంది. 2008లో ఉచితంగా ఆపరేషన్ చేయించి తండ్రి ప్రాణం నిలబెడితే ఆయన తనయుడు జగన్ గత ప్రభుత్వంలో మా సొంతింటి కలను సాకారం చేశాడు.
– చేబోలు వీర్రాజు, ఆకివీడు
వైఎస్సార్ వల్లే బతికాను
నేను పాల వ్యాపారం చేసేవాడిని. ఒక రోజు పాల సైకిల్ వేసుకుని వెళ్తుండగా చాతిలో నొప్పి వచ్చి ఆయాసం అనిపించింది. వైద్యులను సంప్రదించగా వెంటనే పెద్దాసుపత్రికి చూపించుకోమన్నారు. రాజమహేంద్రవరంలో చూపిస్తే బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు. ఆ సమయంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో ఫ్రీగా ఆపరేషన్ చేసి మందులు అందచేశారు. ఆ మహానుభావుడు ప్రవేశపెట్టిన పథకం వల్లే జీవితం గడుపుతున్నాను.
– జి.త్రినాథులు, మేడపాడు


